మంగళగిరి వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ప్రాణహాని ఉందట. అది కూడా తెలుగుదేశంపార్టీ నేతల నుండేనా ? అవుననే అంటున్నారు ఎంఎల్ఏ. ఈ మేరకు తన సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజలను, బెదిరింపు ఫోన్ల వివరాలను ఆళ్ళ పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు రూపంలో ఇచ్చారు.
ఇంతకీ విషయం ఏమిటంటే దాదాపు ఐదేళ్ళుగా చంద్రబాబునాయుడు కంటిలో నలుసులాగ తయారయ్యారు ఆళ్ళ. సిఎంగా ఉన్న కాలంలో చంద్రబాబును ఎంఎల్ఏ కోర్టు కేసులతో ముప్పుతిప్పలు పెట్టారు. ఓటుకునోటు, సదావర్తి భూముల వేలం, రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా లాక్కోవటం లాంటి అనేక అంశాలపై చంద్రబాబు ప్రభుత్వంపై ఆళ్ళ పెద్ద ఎత్తున న్యాయపోరాటాలు చేశారు. అందుకనే ఆళ్ళపై అప్పట్లో చంద్రబాబు నిరంతర ఇంటెలిజెన్స్ నిఘాను ఉంచారు.
సరే అదంతా చరిత్ర అనుకోండి. తాజాగా మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ను ఓడించారు. అప్పటి నుండి టిడిపి నేతల నుండి, లోకేష్ అన్న సైన్యం పేరుతో ఆళ్ళకు బెదిరింపు ఫోన్లు, మెసేజులు వస్తున్నాయట. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా కరకట్ట మొత్తం ముంపు ప్రాంతంగా మారిన విషయం తెలిసిందే. అందుకనే చంద్రబాబు నివాసముంటున్న అక్రమకట్టడంపై ఆళ్ళ దృష్టి పెట్టారు.
ఈ విషయంలోనే టిడిపి నుండి తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు వస్తున్నాయంటూ ఆళ్ళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫెస్ బుక్ లో కూడా తన అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని తన ఫిర్యాదులో చెప్పారు. టీమ్ లోకేష్, టిడిపి చెన్నై ఫోరమ్ పేరుతో తనను బెదిరిస్తున్నట్లు ఆళ్ళ చెప్పారు. చూద్దాం ఎంఎల్ఏ ఫిర్యాదుతో పోలీసులు ఏ విధంగా యాక్ట్ చేస్తారో ?