ఆంధ్రా కాంగ్రెస్ టిడిపికి సాయం చేస్తున్నదా?

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అధికార పార్టీ విఫలమయిందని చెప్పేందుకు, రుజువు చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంటాయి. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమం మొత్తం అధికార పార్టీని రోడ్డు కీడ్చడమే. అదే పనిగా పెట్టుకుంటాయి, సభలు నిర్వహిస్తాయి, ర్యాలీలు జరుపుతాయి, పాదయాత్రలు చేస్తాయి. ప్రతిపక్ష పార్టీల క్యాంపెయిన్ మొత్తం అధికార పార్టీ చుటూ  తిరుగుతూ ఉంటుంది. అయితే, ఆంధ్రలో దీనికి భిన్నమయిన పరిస్థితి ఉంది.

ఆంధ్రలో అధికార పక్షంతెలుగు దేశం పార్టీ ఎంత తీవ్రంగా విమర్శలకుగురవుతూ ఉందో ప్రధాన ప్రతిపక్షమయిన వైసిపి కూడా అదే స్థాయిలో దాడికి గురవుతూ ఉంది.  దీనికి కారణం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీత్  వైఎస్ ఆర్ కాంగ్రె స్ పార్టీ రాసుకుపూసుకుతిరుగుతూ ఉండటమే. ఫలితంతా బిజెపితో ఇటీవలే విడాకులు తీసుకున్న తెలుగుదేశం పార్టీకి, చావుదెబ్బనుంచి కోలుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి వైసిసి ‘అధికారపక్షం’ అయింది.  అదే విధంగా ఇపుడు వామపక్షాలు కూడా వైసిపిని బిజెపి ఏజంటుగానే చూస్తున్నాయి.  బిజెపితో స్పిరిచ్యువల్ అనుబంధం ఉన్న జనసేన పార్టీ అధినేత కూడా వైసిపి తలంటుతూనేఉన్నారు. ఇలా అన్నివైపుల నుంచి వైసిపి అధికార పార్టీలాగా రాళ్ల దెబ్బలు తినాల్సి వస్తున్నది.

అందరూ ఒకటే విమర్శ. ప్రతిపక్ష పార్టీగా వైసిపి విఫలమయిందని. సాధారణంగా ప్రభుత్వాలు విఫలమవుతాయి, పాలక పార్టీ ఫెయిలవుతుంది.  కాని, ప్రతిపక్షం విఫలం కావడమేమిటి? ప్రతిపక్షం చేతిలో ఏముంటుంది? అసెంబ్లీలో కాకపోతే రోడ్ల మీద ధర్నాలు చేయడం తప్ప మరొక కార్యక్రమం లేని ప్రతిపక్ష పార్టీ విఫలమయిందన్న విమర్శలు ఎదుర్కోవడం ఏమిటి?

ప్రతిపక్ష నేత జగన్ టిడిపి మీద ప్రయోగించిన బ్రహ్మా స్త్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది. దానిని ప్రయోగించాల్సింది ఎవరి మీద? ఆ హోదా ఇచ్చే ది ఎవరు? హోదా ఇచ్చేది కేంద్రం అయినపుడు, హోదా తీసుకురాకుండా కేంద్రంతో లాలూచిపడి నాలుగేళ్లు సమయం వృధా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉతికి ఆరేయాల్సిందే, అయితే  చంద్రబాబు కు తాయిళం వేసి, హోదా ఎగ్గొట్టి రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ద్రోహంచేసిందని బిజెపిని, ప్రధాని మోదీని అదే తెడ్డుతో మోదాలి కదా? అదిజరగడం లేదు.  తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాల మీద జగన్ అద్బుతంగా పోరాడుతున్నా, వాటిని జనం ముందుపెట్టేందుకు నాలుగేళ్లు అలుపెరుగని క్యాంపెయిన్ నడిపిస్తున్నా, మోదీని విస్మరించడంతో జగన్ అజండా వీక్ అయింది.. ఇది అందరికి తెలుసు.  మోదీని ఎందుకు టార్గెట్ చేయాలంటే, ప్రధాని మంత్రి అభ్యర్థి గా తిరుపతిలో ప్రచారం చేస్తున్నపుడు ప్రత్యేక హోదాఇస్తానని తిరుమలేశునిగా సాక్షిగా హమీ ఇచ్చి ఆంధ్రులను వూరించింది మోదీయే.

మోదీ, చక్కగా చంద్రబాబు డిమాండ్లేవో  తీర్చి హోదాను విస్మరించడం, హోదా మీద అడ్డదిడ్డమయిన ప్రకటనలుచేయడం తెలుగు ప్రజలు గుర్తించారు. ఇలాంటి మోదీ  మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క విమర్శ చేయడం లేదు.  వైసిపి కి ఉన్న ఈ బలహీనత మీద తెలుగుదేశం తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ దాడి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ మీద ఇలా విరుచుకుపడేందుకు కారణం, ఆంధ్రలో చాలా బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసిపి బలహీన పడాలి. అపుడే,  2014 లో అసెంబ్లీలోకాలుకూడా మోప లేకపోయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులకు, మొదటి సారి ఎన్నికల్లో తలపడుతున్న జనసేనకు చోటు దొరుకుతుంది. దొరుకుతుందో లేదో గాని అదీ వాళ్ల ఆశ. అందుకే  జగన్ నాయకత్వంలోని వైసిపిని బిజెపి పక్షంగా చూస్తూ విమర్శిస్తున్నారు.  రాష్ట్రంలో మోదీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మోదీ ని జగన్ గాడ్ ఫాదర్ కూ చూపడం వల్ల నష్టం జరిగే ప్రమాదం మెండుగా ఉంది.

కాంగ్రెస్ లైన్ కూడా మారింది

ఇపుడు కాంగ్రెస్ పార్టీ కూడా వైసిపి ప్రతిపక్ష పార్టీగా విఫలమయిందని  కాంగ్రెస్ కూడా రోడ్డెక్కింది.  ఎఐసిసి ఆంధ్ర ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి వూమన్ చాందీ నిన్న నెల్లూరు మాట్లాడుతూ  వైసిపి ని తీవ్రంగా విమర్శించారు.

‘‘పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తెలుగుదేశం, బిజెపి నమ్మ బలికి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారు. నాలుగేళ్ల ఈ పార్టీలు కలసి  పాలించి ఇపుడు హోదా గురించి ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. కలసి చేసిన మోసాలు బయట పడి ఎన్నికలపుడు నష్టం కల్గిస్తాయని తెలిసే ఈ  నాటకాలాడుతున్నారు. ఇలాంటపుడు వీరిద్దరి మీద పోరాటం చేయకుండా వైసిపి ప్రధాన పక్షంగా విఫలమయింది. ప్రజాసమస్యల పై పోరాడాల్సిన  ప్రతిపక్ష వైసిపి అసెంబ్లీకే వెళ్లడం మానేసింది. ప్రత్యేక హోదా మీద కేంద్రాన్న నిలదీయాల్సిన వైసిపి నేతలు సొంత ప్రయోజనాలకోసం ప్రధాని మోదీని ప్రశ్నించే పరిస్థితిలోనే లేరు. ఇలాంటి సాహసం చేసే శక్తి వైసిపికి లేదు,’’ అని వూమన్ చాందీ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసిపి నేత జగన్ తొలినుంచి క్యాంపెయిన్ చేస్తున్నమాట ఎంత నిజమే అయినా, మోదీని మాటవరసకు కూడా విమర్శించకపోవడం అంతే నిజం.

కాంగ్రె స్ 2019 రాజకీయం

కాంగ్రెస్ పార్టీ  ప్రతిపక్ష పార్టీ మీద విరుచుకుపడటానికి  2019 ఎన్నికల వ్యూహం కూడ ఒక కారణం కావచ్చు. 2019లో ప్రాంతీయ పార్టీలన్నింటిని కూడగట్టి బిజెపిని ఓడించడానికి కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ బిజెపి వ్యతిరేక గుంపులోకి చంద్రబాబు నాయుడు వచ్చి చేరాడు. ‘ఇగో’ సమస్య వదిలేసి బిజెపిని వోడిచేందుకు కాంగ్రెస్ తో కలవాలని చంద్రబాబు నాయుడికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రంలో కాకపోయినా, కేంద్రంలో కాంగ్రెస్ కు టిడిపి సహకరిస్తుందనేవాదన వినబడుతూ ఉంది. ఎందుకంటే,  కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని కాంగ్రెస్ ఇపుడు టిడిపికి శత్రువు కాదు. టిడిపి నిద్రలేకుండా చేస్తున్నది ఇక్కడ వైసిపి, అక్కడ వైసిపికి గొడుగుపడుతున్న కేంద్రం. ఈ విషయంలో కాంగ్రెస్, టిడిపిలది ఒకటే దారి. ప్రతిపక్ష పార్టీగా వైసిపి విఫలమయిందని వూమన్ చాందీ విమర్శించడంలో తెలుగుదేశానికి పరోక్షంగా సాయం చేద్దామనే ఆలోచన కూడా ఉందేమో.