అందుకే.. వారికీ వారే శత్రువు !

మనిషి సాంకేతికంగా ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఒక కులం గురించి మాట్లాడుకోవడం కచ్చితంగా తప్పే. కానీ నేటి రాజకీయానికి ఇప్పుడున్న ప్రధాన అర్హత కులబలం అయిపోయింది. కానీ ఏళ్ళు మారుతున్నా.. తరాలు కరిగిపోతున్నా ఇంకా కులవివిక్ష మాత్రం పోలేదు. కొన్ని కులాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోయిన కాపులకు రాజకీయ అధికారం అందని ద్రాక్షగా మారిందనేది కాదనగలమా..! రాజకీయ ప్రయోజనాలలో మహాఅయితే కాపు నేతలు బాగుపడ్డారు గానీ, కాపులు మాత్రం బలిపశువు అవుతూనే ఉన్నారనేది పచ్చి నిజం.

పార్టీ ఏదైనా… తెలుగుదేశం కావొచ్చు, ఇప్పుడు వైసీపీ కావొచ్చు. కాపులను ఒక ఓటు బ్యాంకుగానే ఆయా పార్టీలతో పాటు కాపు నాయకులూ కూడా అలాగే చూస్తారు. ఈ మధ్యలో ఏ కాపు ఉద్యమ కారుడో పుట్టుకొస్తాడు. మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభం అలా వచ్చిన వారే. కాపులను ఏకం చేసి వారిని రాజకీయ అధికారం దిశగా నడిపించాలని చూసినా కాపులకి చివరికి మిగిలింది ఏమిటి ? ఏపీ రాజకీయాల్లో కాపులకు తమ కింద కీలక పదువులు ఇవ్వకుండా ఆ నేతలను ఎదగనీయకుండా చేస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ, వైసీపీ పార్టీల పై ఉన్నా.. కాపులలో ఎక్కువమంది ఆ పార్టీలనే నమ్ముతారు.

నిజానికి కాపుల కోసం బీజేపీ ఎప్పుడో గాలం వేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంచుకోవడంతోనే ఏపీలో బీజేపీ కుల సమీకరణాలు పసిగట్టి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ను కూడా కలుపుకుంది. పవన్ సామాజికవర్గమైన కాపులు ఏపీలో దాదాపు 20శాతం మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు పవన్ వెన్నంటే ఉన్నారు. అయితే పదవుల యావలో పడి కాపు సామాజికవర్గానికి సొంత పార్టీ నేతలే ద్రోహం చేస్తున్నారన్న ఆవేదన కాపుల్లో ఉంది. అందుకే వారికీ వారే శత్రువు. మరి ఇప్పటికైనా కాపులంతా ఏకం కావాలని కోరుకుందాం.