వైఎస్సార్సీపీ మీద బాంబు పేల్చిన వైఎస్ షర్మిల.!

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల, తన అన్న, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద ఆమె చేస్తోన్న ప్రతి ఆరోపణా, సూటిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడో గుచ్చుకుంటోంది.

మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే గట్టిగా తగులుతున్నాయి, తెలంగాణ కంటే. ఎందుకంటే, ఏపీలో పలు ప్రాజెక్టులకు సంబంధించి తరచూ మేఘా సంస్థ పేరే వినిపిస్తోంది.

ఒకే వ్యక్తికి అన్ని ప్రాజెక్టులు అప్పగించి, కమిషన్లు దండుకుంటున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన విమర్శలు, ఏపీలో అధికార పార్టీకి ఇంకా గట్టిగా తగిలేయడంతో, వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.

భద్రాచలం ముంపు విషయంలో కేసీయార్, వైఎస్ జగన్.. ఇద్దర్నీ ఒకే గాటన కట్టి విమర్శించారు షర్మిల. తన అన్న వైఎస్ జగన్ పేరుని నేరుగా తీసుకురాలేదుగానీ, ‘మీరూ మీరు కౌగలించుకున్నారు కదా.?’ అంటూ సాగదీశారు షర్మిల.

ఈ వ్యవహారంపై వైసీపీలో లోతుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో షర్మిల తన రాజకీయమేదో తాను చేసుకోక, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీకి తగిలేలా విమర్శలు చేయడమేంటన్నది వైసీపీ నేతల ప్రశ్న.