విశాఖ ఉత్తర నియోజకవర్గ టిడిపి అభ్యర్ధిగా సబ్బం హరి?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై టిడిపి పూర్తి స్ధాయి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. వివిధ పార్టీల నేతలు  ఖరారు అవుతున్నారన్న కలవరం టిడిపిలో మొదలైనట్టుంది. దాంతో వారు కూడా గెలుపు గుర్రాల కోసం ఇప్పటి నుంచే వేట ప్రారంభించారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ఎంపికపై పలు  రకాల వార్తలు వస్తున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ బలంగా ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ను అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. దీంతో ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వైసీపీతో అంటిముట్టనట్టుగానే ఆయన ఉంటున్నాడు. దీంతో ఆయనతో సంప్రదింపులు జరిపి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటి చేయించాలని టిడిపి భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ నియోజకవర్గానికి 2009కి ముందు నియోజకవర్గ ఇంఛార్జీగా భరణికాన రామారావు పనిచేశారు. 2009 ఎన్నికల్లో
ఆయన భార్య జయ ఈ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓడిపోయారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్ది విష్ణుకుమార్ టిడిపి మద్దతుతో పోటి  చేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఈ నియోజక వర్గానికి టిడిపి ఇంఛార్జ్ లేరు. దీంతో టిడిపి బలంగా ఉన్న ఈ  నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలనే పట్టుతో టిడిపి పెద్దలు, స్ధానిక నేతలు ఉన్నారు. అయితే సబ్బం హరిని పోటి చేయించాలని టిడిపి పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు టిడిపి నేతలు సబ్బం హరిని సంప్రదించారని, దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.అందుకే సబ్బం హరికే టిక్కెట్ ఖాయమన్న వార్తలు ప్రచారమవుతున్నాయి.

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల  రమేష్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి , స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణారెడ్డి కూడా పోటి పడుతున్నారు. ఇప్పటికే ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఎవరికీ టిక్కెట్ కేటాయించినా వారికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించేందుకు కృషి చేస్తామని మాత్రం బాహాటంగా తెలుపుతున్నారు. ఉన్న వారికి టిక్కెట్ లేదు కానీ లేని వారికి టిక్కెట్ కేటాయించి  ఎదురుచూస్తున్నారని టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్బం వచ్చేనా లేక ఉన్నవారిలోనే ఎవరికో ఒకరికి టిక్కెట్ దక్కుతుందా అనే ఉత్కంఠ విశాఖ ఉత్తర నియోజకవర్గ నేతల్లో మొదలైంది.