కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు రీ ఎంట్రీ.. ఆనందంలో ఫ్యాన్స్…!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గత కొన్ని సంవత్సరాలుగా మాటీవీలో ప్రసారమవుతు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్లో డాక్టర్ బాబు, దీప పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి. డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్ ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు పొందాడు. అయితే కొంత కాలం క్రితం డాక్టర్ బాబు, దీప పాత్రలు చనిపోవడంతో వారిని సీరియల్ నుండి తొలగించారు. ఇక హిమ, శౌర్య పాత్రలు పెద్దవాళ్ళని చేసి సీరియల్ కొనసాగిస్తున్నారు. అయితే ఈ సీరియల్ లో దీప, డాక్టర్ బాబు లేని లోటు బాగా కనిపిస్తోంది.

ఈ రెండు పాత్రలు లేకపోవటంతో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన ఈ సీరియల్ ని చూసే ప్రేక్షకులు తక్కువయ్యారు. అందువల్ల సీరియల్ రేటింగ్స్ కూడా బాగా పడిపోయాయి. దీంతో ఎలాగైనా ఈ సీరియల్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దీపని మళ్లీ ఈ సీరియల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే దీప కోమా నుండి బయటపడి డాక్టర్ బాబు అంటూ కలవరిస్తున్న ప్రోమో విడుదల చేశారు. దీంతో ఇక డాక్టర్ బాబు కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒకప్పుడు జుట్టుకు తెల్ల రంగు వేసుకోవాల్సి వస్తుందని ఈ పాత్ర చేయటానికి నిరాకరించిన డాక్టర్ బాబు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ క్రమంలో డాక్టర్ బాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. కార్తీకదీపం సెట్ లో తలకు కట్టు కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న ఫొటోలను నిరుపమ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. గెట్ రెడీ.. డాక్టర్ బాబు ఆన్ డ్యూటీ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలియటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వెల్కమ్ బ్యాక్ డాక్టర్ బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.