ఒకేసారి పది సినిమాలు.. యువనిర్మాత గట్స్‌ని హ్యాట్సాఫ్
కరోనా వ్యాప్తితో ప్రపంచం అల్లకల్లోలం అయ్యింది. ముఖ్యంగా వినోద పరిశ్రమలు అతలాకుతలం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎవరూ ఊహించనిది. ఇప్పుడున్న సంక్షోభ సమయంలో కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేయాలంటేనే టాలీవుడ్ నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.
కొందరు ప్రకటించిన ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకుంటున్నారు. కానీ యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను క్యూలోకి తెచ్చి వేడి పెంచేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. జెర్సీ.. భీష్మ లాంటి క్లాసిక్ హిట్ చిత్రాల్ని నిర్మించిన సదరు నిర్మాత క్రైసిస్ కి అదరక బెదరక వరుస ప్రాజెక్టుల్ని ప్లాన్ చేస్తుండడం షాకిస్తోంది.
సితారా ఎంటర్ టైన్ మెంట్స్ లో పలువురు యువహీరోలు.. దర్శకుల్ని లాక్ చేసి వరుసగా సినిమాల్ని ప్లాన్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నితిన్ రంగ్ దే .. నాగ శౌర్య తో మూవీ సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు మలయాళ సూపర్ హిట్ చిత్రాల అయ్యప్పనమ్ కోషియం, కప్పేల రీమేక్ హక్కులను వంశీ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాల స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌లో రవితేజ, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కప్పేలా రీమేక్‌లో విశ్వక్ సేన్ నటించనున్నారు. మరోవైపు నానితో శ్యామ్ సింఘరాయ్ ను కూడా సితార బ్యానర్ ప్రకటించింది. ఇది నాని కెరీర్లో అత్యంత ఖరీదైన చిత్రం. కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుని నరుడి బ్రాతుకు నటన చిత్రంతో బిజీగా ఉన్న సిద్ధు జొన్నలగడ్డ సితారకు సంతకం చేశాడు. ఓ కామెడీ సెటైరికల్ మూవీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
మారుతి, గౌతమ్ టిన్ననూరి, సుధీర్ వర్మ, కిషోర్ తిరుమల, సైలేష్ కోలను, వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర తదితరులకు వంశీ అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేశారు. వీళ్లంతా స్క్రిప్టుల్ని బెటర్ మెంట్ చేసే పనుల్లో ఉన్నారుట. సితార బ్యానర్ లో కొన్ని ప్రాజెక్టులు స్క్రిప్టింగ్ దశలో ఉండగా.. మరికొన్ని ప్రాజెక్టులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మొత్తం పది సినిమాలు ఒకేసారి ఇలా లైన్ లో పెట్టడం అంటే ఆషామాషీనా? ఎంతో గట్స్ ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. మహమ్మారీ ఊపిరాడనివ్వకపోయినా ఎక్కడా తగ్గలేదు సదరు యువనిర్మాత.