ప్రధాని మోదీ లేదా ఆర్థిక మంత్రి ఏ మీటింగ్ పెట్టినా వినబడే మాట దేశం ఆర్థికంగా చితికిపోయింది, ఖజానా ఖాళీ అవుతోంది. నిధులు అస్సలు లేవు. కరోనా కష్టాల్లో చిక్కుకున్న పేదలను ఆదుకోవడానికి ఖర్చు పెట్టడం కోసం కూడా నిధులు లేవు. ఇలా ప్రతిదానికీ ఆర్థికంగా దిగజారిపోయాం అంటూ బీద మాటలు మాట్లాడే కేంద్ర సర్కార్ కొత్త నివాసాలు, భవంతులు కట్టడం కోసం వేల కోట్లు వెచ్చించడానికి సిద్దమవుతోంది. మోదీ కొత్త పార్లమెంట్ భవనం కట్టాలని చాలా కాలం క్రితమే అనుకున్నారు. అందుకోసం అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ద్వారా కొత్త పార్లమెంట్, ప్రధానికి, ఉపరాష్ట్రపతికి కొత్త నివాస భవనాలు, ఇంకా రాజ్ పథ్ ప్రాంతంలో ఉన్న అనేక పాత ప్రభుత్వ భవనాలను కూల్చివేసి కొత్తవి నిర్మించడం. ఈ ప్రాజెక్టును గుజరాత్ కు చెందిన హెచ్సీపీ డిజైన్స్ చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 20 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కరోనా లాక్ డౌన్ ముందు జరిగిన ఈ ప్లానింగ్ ఆర్థికపరమైన కష్టాల్లో దేశం ఉన్నా ఆగడంలేదు. పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు.
అసలు ఇప్పటికిప్పుడు కొత్త భవనాలు ఎందుకనే ప్రశ్నకు మోదీ ప్రభుత్వం చెబుతున్న సమాధానం అధునాతన భవనాలు నిర్మించాలి, పాత భవనాల సామర్థ్యం సరిపోదు. ఇలా ఉన్నపళంగా పాత వాటిని కూల్చేసి వేల కోట్లు పెట్టి కొత్త భవనాలు కట్టడం అనే ప్రక్రియ దేశ ఆర్థిక స్థితి బాగున్నప్పుడైతే సరే కానీ కష్టాల్లో ఉండగా అవసరమా అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజెంట్ వైద్య రంగం మీద వీలైనంత అధిక నిధులు ఖర్చు పెట్టి కొత్త ఆసుపత్రులు, ఐసీయూలు, వెంటిలేటర్లు, పీపీఏ కిట్లు సమకూర్చుకోవాలి. పనులు లేక ఆకలి బాధలు పడుతున్న పేదలను కొద్దోగొప్పో ఆదుకోవాలి. అంతేకానీ అత్యవసరం కాని కొత్త భావనాల కోసం వేల కోట్లు వెచ్చించడం సమంజసమైన పని కాదు. మరి ఈ విషయంలో కేంద్రం ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.