కరోనా మహమ్మారి కారణంగా వరల్డ్ మొత్తం భయాణక వాతావరణం ఏర్పడింది. దీని భారిన పడని దేశం అంటూ లేదు. ప్రాంతం లేదు. అగ్ర రాజ్యమే కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. ఇక మిగతా దేశాల పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో ఈ మహమ్మారి నుంచి తమ దేశాన్ని రక్షించుకోవాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించి చాలా వరకు దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
దీనీ కారణంగా ఎక్కడా ఏదీ లభించని పరిస్థితి. నిత్యావసర సరుకులు కూరగాయలు తప్ప మరేదీ లభించడం లేదు. ఇదిలా వుంటే మందు షాపులు కూడా బంద్ కావడంతో మందు బాబులు బోరు మంటున్నారు. రెగ్యలర్‌గా చుక్క దొరక్కపోయే సరికి చిత్ర విచిత్రమైన చేష్టలతో ఇంటిల్లిపాదిని భయపెడుతున్నారు. దీన్ని భరించలేని కొంత మంది కుటుంబ సభ్యులు మందు బాబుల కోసం మద్యం ఎక్కడ దొరుకుతుందా అని ఆరాలు తీస్తున్నారు. ఇలాంటి సమయాన్ని క్యాష్ చేసుకోవాలని కొంత మంది కక్కుర్తిని ప్రదర్శిస్తూ ఒక్కో బాటిల్‌ని రెండు వేల నుంచి నాలుగు వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ వ్యాపారం ఏదో బాగుందని భావించిన ఓ తమిళ నటుడు ఏకంగా అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసుకుని మూడు నుంచి నాలుగు రెట్ల అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు ఎంజీఆర్ నగర్, అన్నా మెయిన్ రోడ్‌లో వున్న తమళ నటుడు రిజ్వాన్ ఇంటిని సోదా చేస్తే భారీ స్థాయిలో మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు.