జయలలిత బయోపిక్..కుర్ర నిర్మాతకు ముచ్చెమటలెందుకు!
ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి చేసిన తప్పునే తిరిగి రిపీట్ చేస్తున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన ఈ యంగ్ ప్రొడ్యూసర్ కి ఊహించని జోల్ట్ తగిలిన సంగతి తెలిసిందే. ఏదో ఆశిస్తే ఇంకేదో అయినట్టు.. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా విఫలమైంది. అభిమానులు ఎన్నో ఆశిస్తే ఏదో చూపించిన పాపానికి ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్‌ను అందుకుంది. అన్నగారి జీవితంలో రసపట్టులో సాగే ఒక్క ఎపిసోడ్ ని కూడా తెరపై చూపించకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. పైగా అందరికీ తెలిసిన కథను ఏదీ తెలియని వారికి చూపించినట్టు చూపించారేమిటి అంటూ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పైగా ఈ సినిమాని నందమూరి బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి నిర్మించడం తప్పిదమే అయ్యిందని ముచ్చటించుకున్నారు. షూటింగుల్లో వేలు పెట్టిన బాలయ్య ఎఫెక్ట్ రిజల్టుపై దారుణ ప్రభావం చూపించిందని అప్పట్లో చెప్పుకున్నారు.
అయితే ఇంత జరిగినా విష్ణు ఇందూరిలో సరైన పరివర్తన కనిపించడం లేదని తాజా ఇంటర్వ్యూ రివీల్ చేసింది. త్వరలో సెట్స్ పైకి వెళుతున్న జయలలిత బయోపిక్ సంగతుల్ని తాజా ఇంటర్వ్యూలో నిర్మాత విష్ణు రివీల్ చేశారు. అమ్మ బయోపిక్ లో ఏం చూపించబోతున్నారు? అంటే .. ఆమె బాల్యం గురించి… కథానాయికగా ఎదిగిన తీరు.. మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ చూపిస్తామని అన్నారు. అంటే జయలలిత జీవితంలో చప్పగా సాగే ఎపిసోడ్స్ మాత్రమే చూపిస్తారని అర్థమైపోయింది. అమ్మ ఒకసారి కాదు ఆరు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కాలంలో ఏం జరిగిందో అసలు తెరపై చూసే అవకాశమే లేదని అతడు చెప్పిన దాంతో అర్థమవుతోంది. అలా అయితే ఇందులో కూడా అంతగా మసాలా సన్నివేశాలేవీ ఉండవని సెట్స్ కి వెళ్లకముందే అర్థమైపోతోంది. అలాంటప్పుడు ఈ ప్రయత్నం చేయడం దండగ పనేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జీవితకథల్లో వివాదాల్ని చూపించకపోతే అవి కాస్తా ప్లెజెంట్ డాక్యుమెంటరీలుగా మిగులుతాయి కానీ కమర్షియల్ సినిమాలు ఎలా అవుతాయి? అన్న చర్చ సాగుతోంది. అందరికీ ముందే తెలిసిన కథను తెరపై చూపించేప్పుడు ఆ కథలో ఒరిజినాలిటీతో నిజాల్ని చూపించాల్సి ఉంటుంది. జీవితకథలో వివాదాలు ఉంటే వాటిని యథాతథంగా బయపడకుండా చూపించాల్సి ఉంటుంది. ఆ పని చేయకపోతే బాక్సాఫీస్ వద్ద ఫలితం కూడా అలానే ఉంటుంది మరి. యువనిర్మాత దీనిని హెచ్చరికగా భావిస్తారేమో చూడాలి. విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ బయోపిక్ కి తలైవి, జయ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. కంగన కథానాయికగా నటించనుంది. అక్టోబర్ 15న రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.