ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోయి, అనూహ్య పరిణామాల మధ్య జైలు పాలయిన చిన్నమ్మ ..అలియాస్ వివేకానందర్ కృష్ణవేణి శశికళ.. అలియాస్ శశికళ విడుదల తేదీ ఫిక్స్ అయింది. తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అన్నాడీఎంకేలో చిన్నమ్మగా పేరొందిన శశికళ జనవరి 27వ తేదీన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. గత ఏడాది కాలంగా ఆమె విడుదల తేదీ గురించి పలుమార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని ప్రక్రియలు పూర్తయి ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది. బెంగళూరు జైలు అధికారులను ఉటంకిస్తూ ఆమె తరపు న్యాయవాది రాజా సేథురాపాండియన్, శశికళ జనవరి 27న విడుదల కానున్నట్టు మంగళవారం రాత్రి వెల్లడించారు. దీంతో శశికళ అనుచరుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. కాగా, 2016లో జయలలిత దుర్మరణం తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన శశికళ, నాలుగేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని జైలు పాలయిన సంగతి తెలిసిందే.
అయితే నాలుగేళ్ల జైలుశిక్ష పూర్తి కావడంతోపాటు, రూ.10 కోట్ల జరిమానాను చెల్లించి శశికళ విడుదలబోతున్నారు. . ప్రస్తుతం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత , కరుణానిధి మరణించడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే ఘన విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదల అయిన తర్వాత శశికళ వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తికర చర్చజరుగుతోంది.