భారీ క్యాన్వాయ్ తో చెన్నై బయల్దేరిన శశికళ… కారు పై అన్నాడీఎంకే జెండా !

శశికళ .. అలియాస్ చిన్నమ్మ. మాజీ సీఎం జయలలిత నిచ్చెలి శశికళ చెన్నై ఎంట్రీ తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. జయలలిత రాజకీయ వారసత్వం కోసం శశికళకు, అన్నాడీఎంకే మధ్య పోరు జరుగుతుంది. బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంలో అన్నాడీఎంకే జెండాను కారుపై ఉపయోగించిన శశికళ ఆ పార్టీ జయలలిత తర్వాత తనదేనన్న సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు.

Sasikala Returns: బెంగళూరు నుంచి తమిళనాడుకు బయల్దేరిన శశికళ.. ఆమె కారుపై మళ్లీ..

ఈ పరిణామంతో అప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానం తమిళనాడులో కూడా ఆమె పార్టీ జెండాను ఉపయోగిస్తే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించి అప్రమత్తమైంది. అన్నాడీఎంకే జెండాను ఉపయోగించేందుకు శశికళ అనర్హురాలని, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించామని, అందువల్ల పార్టీ జెండాను ఆమె గానీ, ఆమె వర్గంగానీ ఉపయోగించుకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే మంత్రులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి బయల్దేరిన శశికళ మాత్రం అన్నాడీఎంకే జెండాతోనే తన కారులో చెన్నైకి బయల్దేరారు. ఆమె కారు వెంట 100కు పైగా కార్లు బయల్దేరినట్లు తెలిసింది. ప్రతీ కారుపై అన్నాడీఎంకే జెండాను ఉపయోగించినట్లు సమాచారం. ఆమె మాత్రమే కాదు, ఆమె వర్గం కూడా స్వాగత ఏర్పాట్లలో అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించనున్నట్లు తెలిసింది. ఆమెకు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే జెండాలతో చెన్నై హైవేపై ఆమె మద్దతుదారులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూడా శశికళ వెళతారన్న ప్రచారం జరుగుతోంది.