మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా `ఖైదీనంబర్ 150` ఇండస్ట్రీ రికార్డ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బాస్ కంబ్యాక్ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై సంచలన విజయం సాధించింది. చిరు కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ సాధించిన విజయం అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. కొంత గ్యాప్ తర్వాత చిరు కంబ్యాక్ కి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇక తమిళ చిత్రం ఖైదీ ని తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేశారు. ఇందుకోసం చిరు-వినాయక్ బృందం ఎంతో శ్రద్ధ తీసుకుని అహోరాత్రులు శ్రమించారు.
మరో అగ్ర కథానాయకుడు, నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ 100వ సినిమా కోసం ఎంతగా కేర్ తీసుకుని తపించారో తెలిసినదే. క్రిష్ దర్శకత్వంలో `గౌతమి పుత్ర శాతకర్ణి` లాంటి హిస్టారికల్ సబ్జెక్ట్ తో భారీ సాహసమే చేశారు. ఆ మూవీ కూడా బాలయ్య కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇరువురు అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజై సంచలన విజయాలు సాధించడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇక ఇదే తరహాలో ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కెరీర్ 75వ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విక్టరీ వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు స్క్రిప్టు ఎంపిక సహా దర్శకుడి ఎంపికలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నారట. వెంకీ 75 చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించే వీలుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే రేసులో పూరి జగన్నాథ్ పేరు వినిపిస్తోంది. పలువురు యువదర్శకులు సురేష్ బాబుకి స్క్రిప్టు వినిపించారని తెలుస్తోంది. అయితే వెంకీతో ఆ అవకాశం ఎవరికి దక్కనుంది? అన్నది వేచి చూడాల్సిందే.
కలియుగ పాండవులు చిత్రంతో జర్నీ మొదలు పెట్టారు వెంకటేస్. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూశారు. పలు బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన వెంకటేష్ కెరీర్ ఆద్యంతం ఎంతో సెలక్టివ్ కథాంశాల్లో నటించారు. రీమేక్ కథలపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు. ఇక కెరీర్ లో కీలకమైన 75వ సినిమా విషయంలో ఏమాత్రం రాజీకి రావడం లేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నారప్ప (వెంకీ 74)కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. కోవిడ్ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. దర్శకుడిని ఫైనల్ చేసేస్తే.. త్వరలోనే వెంకీ 75 ప్రకటన వెలువడనుందని సమాచారం.