ఆ సొమ్ముతో రియా కొన్న ప్లాట్లు తెచ్చిన పాట్లు..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ (డబ్బు దారి మళ్లింపు) దర్యాప్తు కోసం రియా చక్రవర్తిని ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుపరచనున్నారు. నేటితో రియా హైడ్ అండ్ సీక్ గేమ్ కి తెరపడుతుదనేది పోలీసుల స్టేట్ మెంట్.
అయితే రియా తాజా మీడియా ప్రకటనలో తన స్టేట్మెంట్ రికార్డింగ్ వాయిదా వేయాలని కోరినట్లు ఆమె న్యాయవాది సతీష్ మన్షిందే ఒక ప్రకటనలో వెల్లడించారు. బిహార్ పాట్నాలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రియా అభ్యర్ధనపై ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాలు, దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్‌ను అపెక్స్ కోర్టు కోరింది.
ముంబైలో కొనుక్కున్న రెండు ప్రధాన ఆస్తులకు సంబంధించిన పెట్టుబడులపై రియా వాదనను రికార్డ్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సిద్ధం కాగా రియా ఇచ్చిన తాజా ట్విస్టు వేడెక్కిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి తన ఎఫ్‌ఐఆర్‌లో ఆర్థిక అవకతవకలను ప్రశ్నించడంతో రియా ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి పాట్నాలో ఏడు పేజీల ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా అందులో రియా రెండు అపార్ట్ మెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ .15 కోట్లు తనకు సంబంధం లేని ఖాతాల్లోకి బదిలీ చేసారని తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చేపట్టింది. పాట్నాలో ఎఫ్ఐఆర్ తరువాత విచారణలో పాల్గొన్న బీహార్ పోలీసులు తమ రాష్ట్రానికి బయలుదేరినట్లు సమాచారం. ఇకపై ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంది. తొలిగా రియాపై విచారణను ప్రారంభించింది.