సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ ఆరంగేట్రంతో క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కేసులో రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు రావడం అనంతరం సీబీఐ విచారణలో తెలుస్తున్న నిజాలు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. డ్రగ్స్ దందాతో రియాకు సత్సంబంధాలున్నాయని నమ్ముతున్న సీబీఐ.. నార్కోటిక్స్ బృందాలు ఈ విషయంపై రియాను ప్రశ్నిస్తున్నాయి. నిన్నటి సాయంత్రం వరకూ దాదాపు 9 గంటల పాటు ముంబైలోని ఓ ప్రయివేటు అతిథి గృహంలో సీబీఐ విచారణ సాగింది.
అయితే విచారణ ముగించుకున్న అనంతరం రియా చక్రవర్తి రాత్రి వేళ నేరుగా ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం కలకలం రేపింది. అసలు రియా ఎందుకిలా చేసింది? అన్నది ఆరా తీస్తే.. తనకు మీడియా నుంచి అలానే సుశాంత్ అభిమానుల నుంచి రక్షణ లేదని.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుల్ని కోరేందుకు వెళ్లిందట. ఇక రియా సీబీఐ విచారణ అనంతరం తిరిగి తన సోదరుడితో కలిసి వెళుతున్న క్రమంలో రియా ఇబ్బందులు ఎదుర్కొందట. ప్రతిసారీ మీడియా తమ వెంటపడుతోంది. విసిగిస్తోంది. ఒకానొక సందర్భంలో రియాను మీడియా విపరీతంగా విసిగించింది. అందుకే ఇలా రియా శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిందట. ఇక తన ఇంటి వద్ద కూడా సెక్యూరిటీ కావాలని కోరింది.
మరోవైపు ఈ కేసులో రియా చక్రవర్తిని వెనకేసుకొస్తూ ముంబై పోలీసులు ఆడుతున్న ఆటపైనా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తనకు రక్షణ కోరుతూ ఆమె ముంబై పోలీసుల్ని కలవడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ నాటకాలన్నీ తెరవెనక ఉండి ఎవరో పెద్ద మనిషి ఆడిస్తున్నవేనంటూ ఓవైపు కంగన తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే ఏ నాటకంలో ఏ నిజం ఉందో .. ఏ అబద్ధం దాగి ఉందో సీబీఐ తేల్చాల్సి ఉంటుంది. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని సుశాంత్ కి కాఫీలో కలిపి తాగించేదన్న ఆరోపణల్లో నిజం నిగ్గు తేలాల్సి ఉంటుంది.