యూఎస్ కలెక్షన్స్‌పై మూవీ పాస్ ప్రభావం
పథకం ఏదైనా పారాలంటే అందులో పారదర్శక సేవ స్పష్టంగా ఉండాలి. యాప్ ల పేరుతో బిజినెస్ చేస్తామంటే కుదరదు. ముందుగా ఏదైనా జనాదరణ పొందాలి. గందరగోళం లేకుండా నమ్మకం సంపాదించాలి. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవాలి. హైదరాబాద్ గల్లీలో టీకొట్టు అయినా.. అమెరికాలో యాప్ ల కంపెనీకి అయినా ఇదే రూల్ వర్తిస్తుంది. అయితే ఈ రూల్స్ ని తుంగలో తొక్కిన ఓ యాప్ కథ ఆదిలోనే కంచికి చేరడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఉత్తర అమెరికాలో నిన్నమొన్నటి వరకూ మూవీ పాస్ సిస్టమ్ పై ఆసక్తికర చర్చ సాగింది. దీనివల్ల సినిమాల కలెక్షన్లు పెరిగాయని చెప్పుకున్నారు. కానీ ఇకపై దీని గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చిందన్నది ఓ సమాచారం.
కొన్ని నెలల క్రితం రిలీజైన మన తెలుగు సినిమాలకు అమెరికాలో భారీగా కలెక్షన్స్ పెరిగేందుకు సాయపడిన `మూవీ పాస్` యాప్ ఇకపై అందుబాటులో ఉండదని తెలిసింది. ఈ సెప్టెంబర్ 14తో ఆ యాప్ కనుమరుగవుతోందట. దాదాపు 30 లక్షల మంది సబ్ స్క్రైబర్ల నుంచి ప్రస్తుతం 20లక్షలకు రేంజు పడిపోయిందట. ఆ మేరకు హీలియోస్ అండ్ మాథసన్ అనలిటిక్స్ ఐఎన్‌సీ కథనం సంచలనమైంది. మూవీ పాస్ నిర్వహణ సరిగా లేదు. వినియోగదారుడిని చాలాసార్లు ఇబ్బందులకు గురి చేసింది ఈ యాప్. నిర్వహణ సరిగా లేదు. సరి కదా.. ఎప్పటికప్పుడు టిక్కెట్ల ధరల్లో అనూహ్యమైన పెంపుదల కూడా పెద్ద సమస్యగా పరిణమించింది. అందువల్లనే మూవీ పాస్ విధానం ఫెయిలైందని తెలుస్తోంది. అయితే ఆరంభంలో ఆఫర్లు పేరుతో మూవీ పాస్ స్కీమ్ పెద్ద రేంజులోనే వర్కవుటైంది. కానీ నిర్వహనా లోపంతోనే ఇది ఫెయిలైందన్నది హీలియోస్ అండ్ మాథసన్ విశ్లేషణ.
కారణం ఏదైనా ఒక ఫెయిల్యూర్ బయటపడింది. ప్రస్తుతం మూవీ పాస్ కంపెనీ సేవలు నిలిపేసినట్టే. ఒకవేళ దీనిని వేరొకరు టేకోవర్ చేస్తారా? అన్న చర్చా సాగుతోంది. రంగస్థలం, భరత్ అనే నేను సహా పలు తెలుగు సినిమాలు మూవీ పాస్ వల్ల లాభపడ్డాయని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ మూవీ పాస్ ఎత్తేశాక రిలీజవుతున్న తొలి భారీ తెలుగు చిత్రం `సైరా: నరసింహారెడ్డి`పై దీని ప్రభావం ఎంత? అసలు ఉంటుందా ఉండదా? అంటే .. దాని ప్రభావం నామమాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ పంపిణీదారులందరూ రకరకాల స్కీమ్ లు పేరుతో ఇప్పటికే జనాల్ని థియేటర్లకు ఆకర్షిస్తుండడంతో మన తెలుగు సినిమాపై దీని ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ హాలీవుడ్ సినిమాలపై మాత్రం తప్పక ఉంటుందని విశ్లేషిస్తున్నారు. యూఎస్ లో ఏఎంసీ థియేటర్ల వరకూ దీని ప్రభావం ఉంటుందట.