టాలీవుడ్ గౌర‌వానికి తూట్లు పొడిచిందెవ‌రు?

టాలీవుడ్‌ని ముష్ఠి ఎత్తుకునేలా చేస్తోందెవ‌రు?

ప్ర‌భాస్ `సాహో` విమ‌ర్శ‌ల‌కు అతీతంగా సంచ‌ల‌నాల‌కు తావిస్తోంది. ఈ సినిమా రివ్యూల‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ధ‌లుకొడుతూ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఇండియా బెస్ట్ సినిమాల జాబితాలో సాహో పేరు నిలుస్తుండ‌డం దేనికి సూచిక‌? అంటే.. దీనికి స‌రైన ఆన్స‌ర్ స‌మీక్ష‌కుల వ‌ద్ద ఉందో లేదో!

ఇప్పుడు ఓసారి స‌మీక్ష‌కులే త‌మ రివ్యూల్ని స‌మీక్షించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. టీవీల ముందు.. యూట్యూబ్ చానెళ్ల ముందు బీరాలు పోయిన ప్రేక్ష‌కులే తెల్ల‌బోయేలా ఉంది సీను. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా టెక్నిక‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కించినా క్రిటిక్స్ ఈ సినిమాపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా అదేదీ వ‌సూళ్ల‌ను ఆప‌లేదు. ఇప్ప‌టికే నాలుగు రోజుల్లో ఈ సినిమా 270కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టికే పూర్తిస్థాయి లాభాల బాటలోకి సాహో వెళుతోంద‌న్న చ‌ర్చా ట్రేడ్ లో సాగుతోంది. ఐదు భాషల శాటిలైట్ , ఐదు భాషల డిజిటల్ రైట్స్ (అమెజాన్ , నెట్ ఫ్లిక్స్) ఇవ‌న్నీ క‌లిపి చూస్తే నిర్మాత‌ల‌కు న‌ష్టాలేమీ లేవట‌. థియేటర్స్ షేర్స్ ఇప్ప‌టికే తెలుగులో 60శాతం పైగా వ‌చ్చేవాయి. హిందీలో ఆల్రెడీ లాభాల్లో ఉన్నారు. తమిళ తంబీల్లో వెన‌క‌బ‌డినా క‌ర్నాట‌క క‌లెక్ష‌న్లు దులిపేసింది. బాలీవుడ్లో 100 కోట్ల షేర్ అధిగ‌మించింది. తమిళ్ లో యువి సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. అందువ‌ల్ల న‌ష్టాలేవీ లేన‌ట్టే. కన్నడ, మలయాళం నుండి పూర్తి లాభాలు వ‌స్తున్నాయ‌ట‌. ఇప్పుడు ఏ ఒక్క బయ్యరు నష్టపోయే అవకాశం కూడా లేదని ట్రేడ్ చెబుతోంది. ఒకవేళ కొంత మొత్తం నష్టపోయినా ఆ న‌ష్టాన్ని మొత్తం తిరిగి వెనక్కిఇచ్చేస్తామ‌ని యు.వి. సంస్థ పంపిణీదారుల‌కు భ‌రోసానిచ్చింద‌ట‌. ఒక పెద్ద తెలుగు సినిమా బాలేదు అంటేనే ఇంత‌గా క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. హిట్ పడితే తెలుగు బాక్స్ ఆఫీసు రేంజ్ ఎలా ఉంటుందో ఊహించాలి.

అందుకే ఇప్పుడు సాహో పై నెగెటివ్ క‌థ‌నాలు రావ‌డానికి కార‌కులెవ‌రు? తెలుగు మీడియా అదుపు త‌ప్పి నెగెటివ్ రివ్యూల్ని ఎందుకు రాసింది? బాలీవుడ్ మీడియాకే సాహో పై అంచ‌నా అంద‌లేదా? త‌ర‌ణ్ ఆద‌ర్శ్ కే మ‌తి చెడిందా? స‌మీక్ష‌కులు వంద‌శాతం నిజాల్ని రాయ‌లేక‌పోయారా? అంటూ తిరిగి ప్ర‌శ్నించుకోవాల్సిన స‌న్నివేశం తలెత్తిన‌ట్టే. సాహో అస‌లు విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా వ‌సూళ్లు సాధిస్తోంది. అయినా పంపిణీదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పూర్తి విజ‌యం సాధించిన‌ట్టు కాదు.. ఇంకా వ‌సూళ్లు తేవాల్సి ఉంటుంద‌ట‌.

అయితే ఈలోగానే సాహో టీమ్ కి కొంత డ్యామేజీ జ‌రిగింద‌న్న‌ది వాస్త‌వం. ముఖ్యంగా న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు సుజీత్ పై ఇష్టానుసారం కామెంట్లు చేసిన వాళ్లు ఓసారి త‌ర‌చి చూసుకోవాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డుతోంది. `లార్గో వించ్` ద‌ర్శ‌కుడు జెరోమ్ స‌ల్లే ఒక తెలుగు వెబ్ సైట్లో `సాహో` రివ్యూ చ‌దివాకే త‌న సినిమాకి సాహో కాపీ అని తెలుసుకున్నాడు. అజ్ఞ‌త‌వాసి.. ఆ త‌ర్వాత సాహో రెండూ నా క‌థ‌లే అని అత‌డు చెల‌రేగుతున్నాడు. టాలీవుడ్ పై వ‌రుస‌గా సెటైర్లు వేయ‌డం మొద‌లు పెట్టాడు. సాహోపై ఆ రేంజులో క‌క్ష క‌ట్టి రాసినట్టే అయ్యింది. ఇంత‌కుముందు బాహుబ‌లి రిలీజైన‌ప్పుడు కాపీ క్యాట్ అంటూ రాశారు. కొన్ని సెక్ష‌న్ల మీడియాలు 2 రేటింగ్.. 1.5 రేటింగ్ కూడా ఇచ్చాయి. రాజ‌మౌళి ఈ రివ్యూల‌పై చీద‌రించుకున్న ప‌రిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సాహో పైనే అదే తీరుగా దాష్ఠీకం సాగింద‌ని ప్రాక్టిక‌ల్ గా ప్రూవైంది. ఇలా చేయ‌డం వ‌ల్ల టాలీవుడ్ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై వెలుగుతుందా? నెగెటివిటీ వ‌ల్ల టాలీవుడ్ ప‌రువును అంత‌ర్జాతీయ వేదిక‌ల సాక్షిగా తీసేయ‌డంలో తెలుగు మీడియా కంక‌ణం క‌ట్టుకుంద‌న్న అర్థం వ‌చ్చింది. అస‌లు మీడియాలో ఇంత‌ నెగెటివిటీ.. ఇంత దారుణ‌మైన క‌క్ష పెర‌గ‌డానికి కార‌ణ‌మేంటి? విక్ర‌మార్కా తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావా .. నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును!