మల్టీస్టారర్ అంటేనే బెంబేలెత్తిన డైరెక్టర్
మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అంత వీజీ కాదు. ఇద్దరు స్టార్ హీరోలను స్క్రిప్టుతో మెప్పించాలి. మార్పులు కోరితే ఆ హీరోలకు నచ్చినట్లు గా మళ్లీ మార్పు చేర్పులు చేయాలి. బడ్జెట్ నిర్మాతకు తడిపి మోపెడవుతుంది. సెట్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మరెంతో మందికి పారితోషికాలివ్వాలి. పైగా ఇప్పుడు మల్లీస్టారర్ చిత్రం అంటే ఆ స్క్రిప్ట్ పాన్ ఇండియా లెవల్ కి రీచ్ అయ్యేలా ఉండాలని నిర్మాతల నుంచి కాస్త ఒత్తిడి ఉంది. ఇలా ఒక మల్టీస్టారర్ మొదలైన దగ్గర నుంచి సెట్స్ కెళ్లి పూర్తి చేసే వరకూ ఏ దర్శకుడికైనా తల బొప్పి కట్టేస్తుంది. అందుకే ఏ దర్శకుడైనా అంత తొందరగా మల్టీస్టారర్ల జోలికి వెళ్లడం లేదనేది ఓ విశ్లేషణ.
ఆ విషయం ముందుగానే అనుభవం పూర్వకంగా తెలుసుకున్న ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మళ్లీ జీవితంలో మల్టీస్టారర్ జోలికి వెళ్లనని తేల్చేసాడు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం మహా సముద్రం అనే మల్టీస్టారర్ కథాంశాన్ని సిద్దం చేసి రెడీగా ఉన్నాడు. ఈ స్క్రిప్ట్ పట్టుకుని కాళ్లు అరిగేలా చాలా మంది హీరోల దగ్గరకు తిరిగాడు. కథ-స్క్రిప్టు నచ్చి ఒకే చేసేవారు గానీ…ఎందుకనో చివరిగా వెనక్కి తగ్గి రిజెక్ట్ చేసేసేవారట. చివరగా ఒక హీరోగా శర్వానంద్ ని ఎంపిక చేసారు. తాజాగా మరో హీరోగా ప్లాప్ హీరో సిద్ధార్థ్ ని తీసుకున్నట్లు సమాచారం. ఇంకా సెట్స్ కు వెళ్లకుండానే…సినిమా ప్రారంభం కాకుండానే బాబోయ్ మల్టీస్టారర్ నా వల్ల కాదంటూ అజయ్ చేతులెత్తేసాడు.
ఇదే నా మొదటి…చివరి మల్టీస్టారర్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. ఇందులో ఇన్ని కష్టాలు ఉంటాయని ఊహించలేదని తెలిపాడు. దర్శకుడిగా అజయ్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు కాబట్టి అతని పరిశ్రమలో సాధించాల్సింది చాలానే ఉంది. అజయ్ తో పనిచేయాలని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. కానీ కెరీర్ ఆరంభంలోనే ఇలా చేతులేత్తడంతో! అతనికి ఓర్పు..సహనం తక్కువ? కమిట్ మెంట్ లోపం కనిపిస్తుంది!! అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.