డార్లింగ్ మల్టీప్లెక్స్ చెయిన్ వార్
సూపర్ స్టార్ మహేష్ ఇటీవలే ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఏషియన్ సునీల్ నారంగ్‌తో కలిసి ఈ సరికొత్త ఫ్రాంఛైజీ బిజినెస్‌కి తెర లేపారు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ తరహా బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నారు. తొలిగా అమీర్ పేట (హైదరాబాద్) సత్యం థియేటర్ ప్లేస్ లో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏఏఏ సినిమాస్ పేరుతో ఈ మల్టీప్లెక్స్ చెయిన్ ప్రారంభం కానుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ కూడా స్నేహితులతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లో ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు సూళ్లూరుపేటలో రెండేళ్లుగా ప్రభాస్ సొంత మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. `వీ-ఎపిక్` పేరుతో ఇప్పటికే నిర్మాణం ముగించుకుంది. ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ని ఆగస్టు 30న ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వీఎపిక్ ప్రారంభోత్సవానికి అతిధుల్ని ఫిక్స్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకూ రామ్ చరణ్, ఎన్టీఆర్ అంటూ రకరకాల పేర్లు పరిశీలించారు. అయితే అనూహ్యంగా ప్రభాస్ షెడ్యూల్స్ ఆరోజు కుదరకపోవడంతో ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దాంతో ఉన్నఫళంగా నిర్ణయం మార్చుకున్నారు. ఈ వేడుకకు పెద్ద స్టార్లను ఎవరినీ పిలవకూడదని భావిస్తున్నారట. ఆరోజు `సాహో` చిత్రం ప్రదర్శించి వీఎపిక్ థియేటర్స్ ని అధికారికంగా లాంచ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని తెలుస్తోంది. సాహో చిత్ర బృందం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.