రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న మర్డర్ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రణయ్ తండ్రి, అమృత మామ పెరుమాళ్ బాలస్వామి ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాల గూడ పోలీస్ లకు వర్మపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వర్మపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రణయ్ హత్య కేసు కోర్టులో ఉన్నప్పుడు మర్డర్ సినిమా ప్రభావం కేసు పై పడుతుందనే ప్రమాదం ఉందని, కాబట్టే సినిమా ఆపాలంటూ బాలస్వామి డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంలో చట్టపరంగా ఎంత దూరమైనా వెళ్తానని హెచ్చరించాడు. తాజాగా ఈ వివాదంపై వర్మ ట్విటర్ ద్వారా స్పందించాడు.
మర్డర్ సినిమా వాస్తవ సంఘటనలు ఆధారంగా చేస్తున్నాను తప్ప, అదే కథ కాదని తెలిపాడు. మర్డర్ సినిమాలో ఏ కులాన్ని గానీ, మతాన్ని గానీ, వర్గాన్ని గానీ అగౌరవ పరచలేదన్నాడు. అలాంటి ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదన్నాడు. బాలస్వామి ఫిర్యాదు మేరకు తాము చట్టపరంగానే ముందుకెళ్తామని, సినిమాను ఆపే ప్రశక్తి లేదని కుండబద్దలు కొట్టేసాడు. మరి ఈ వ్యవహా రం ఎంత దూరం వెళ్తుందో! తొలుత ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు అమృత సెటైరికల్ గా స్పందించింది. అలాగే సినిమాపై గానీ, వర్మపై గానీ ఎలాంటి పోలీస్ కేసు పెట్టనని ఓ లేఖ కూడా రాసింది. కానీ బాలస్వామి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
కోడలికి తెలియకుండా కేసు వేసాడా? లేక అన్ని తెలిసే అమృత వెనుకుండి మామను ముందుకు నడిపిస్తుందా? అన్న అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. మరి వీటన్నింటికి తెరపడాలంటే? కొంచెం టైం పడుతుంది. ప్రణయ్-అమృత కులాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిపై కక్షతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ని కిరాయి రౌడీలతో అతి కిరాతకంగా మిర్యాలగూడ నడిబొడ్డున నరికి చంపించాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆ కేసులో జైలుకెళ్లి వచ్చిన మారుతిరావు కొద్ది రోజులకే హైదరాబాద్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు వర్మ ప్రధానంగా కెలికేది కూడా ఈ అంశాలనే.