(సూర్యం)
ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసి హిట్ చేయటం ఎప్పుడూ సవాలే. ముఖ్యంగా నేటివిటి సమస్య రీమేక్ లకు వస్తూంటుంది. ఒరిజనల్ లో ఉన్న ఫ్లేవర్ మిస్ అవ్వకుండా రీమేక్ చేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా రీమేక్ చేయటం కూడా రాదు అంటారు. ఉన్నది ఉన్నట్లు చేస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ లేపాడు ..డైరక్టర్ గొప్ప ఏముంది అంటారు. అంతా కత్తిమీద సామే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే….
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి ఇప్పుడు అనేక భాషల్లో రీమేక్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ పూర్తి అయ్యి రిలీజ్‌కు రెడీ అవుతోంది. విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా అర్జున్ రెడ్డిని ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. తెలుగులోనూ మార్కెట్ ఉన్న దర్శకుడు బాలా.. ఈ రీమేక్‌ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులతో తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే అర్దమవుతోంది.
చూస్తూంటే ఈ రీమేక్ తమిళంలో సంచలనం సృష్టించి..ధృవ్‌ని కూడా ఓవర్‌నైట్ స్టార్ చేసేటట్లే ఉంది అంటున్నారు తమిళ తంబీలు. అయితే తెలుగువాళ్లు మాత్రం అబ్బే తెలుగులో ఉన్నంత గొప్పగా లేదు అని పెదవి విరిచేస్తున్నారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్కేసి మీ అభిప్రాయం కూడా పంచుకోండి.