క్షమాపణ చెప్పి.. ట్వీట్‌ డిలీట్‌ చేసిన చిన్మయి

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే సింగర్ చిన్మయి. ఆమె ఆ మధ్య క్యాస్టింగ్ కౌ చ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. ప్రముఖ తమిళ లిరిక్ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో చిన్మయి హాట్ టాపిక్‌గా మారడంతో పాటు తమిళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ కూడా ఎదుర్కొంది. అయినా ఆమె తన ఉద్యమం ఆపలేదు. లైంగిక వేధింపులకు గురి అయిన భాధితులకు ఆమె అండగా ఉంటున్నారు. వారి పక్షాన మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. దాంతో చిన్మయి శ్రీపాద ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు క్షమాపణలు చెప్పారు.

రీసెంట్ గా చిన్నయి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీకి చెందిన ఓ పోలీసు.. అత్యాచార బాధితురాలిని కోర్కె తీర్చాల్సిందిగా వేధించాడని ఆ పోస్ట్‌లో ఉన్న సందేశం. దీని గురించి చిన్మయి స్పందిస్తూ.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే ఎలా? అన్నారు. అయితే ఈ పోస్ట్‌ ఫేక్‌ అని యూపీ పోలీస్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

‘ఎప్పుడో 2017లో జరిగిన ఘటన గురించి 2019లో ఓ సెలబ్రిటీ పోస్ట్‌ చేయడం అనూహ్యంగా ఉంది. అందులోనూ అది ఫేక్‌ న్యూస్‌. బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. అంతేకాదు ఫిర్యాదు తీసుకున్న ఎస్సై కూడా తనను లైంగికంగా వేధించాలని చూశాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు ఎస్సైపై విచారణ జరిగిన అనంతరం అది అబద్ధమని తేలింది’ అని పేర్కొన్నారు.

ఇందుకు చిన్మయి రెస్పాండ్ అయ్యి.. ‘ఈ ట్వీట్‌ చేసినందుకు క్షమించండి. నన్ను గుర్తించి మీరు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి సంఘటనలు ఏవైనా ఉంటే నేను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూనే ఉంటాను. కనీసం ఈ రకంగానైనా బాధితులకు న్యాయం జరుగుతుందని, నిందితులకు శిక్ష పడుతుందని నేను అలా చేశాను. నేను పెట్టిన పోస్ట్‌ను డిలీట్‌ చేశాను’ అని సమాధానమిచ్చారు.