ఉద‌య్ కిర‌ణ్.. సుశాంత్ ఉదంతాలు నేర్పిన పాఠం!

టాలీవుడ్ రైజింగ్ హీరో ఉద‌య్ కిరణ్ అక‌స్మాత్తుగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కేవ‌లం 33 చిన్న వ‌య‌సులో క‌డ‌తేరిపోవ‌డం విషాదం నింపింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ 34 వ‌య‌సులోనే ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆ ఇద్ద‌రి ఆత్మ‌హ‌త్య‌ల వెన‌క కార‌ణాలు వేరైనా అంత‌రార్థం ఒక‌టే. ఆ ఇద్ద‌రి ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం సున్నిత మ‌న‌స్కులు కావ‌డ‌మేన‌ని మాన‌సిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.

ఇక ప‌రిశ్ర‌మ కుట్ర కోణంపైనా విస్త్ర‌తంగానే చ‌ర్చ సాగుతోంది. అయితే ప‌రిశ్ర‌మ ఏదైనా కుట్ర‌లు కామ‌న్.. కేవ‌లం వినోద ప‌రిశ్ర‌మ‌లోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఈ కుట్ర‌లు ఉంటాయి. సినీరంగంలోనివి బ‌య‌ట ఎక్కువ ఫోక‌స్ ఉంటుంది అంతేన‌ని ప‌లువురు ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వృత్తిగ‌త విష‌యాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాలు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపించాయ‌ని చెబుతున్నారు.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై ఇత‌రుల కంటే సైఫ్ అలీఖాన్.. మ‌నోజ్ భాజ్ పాయ్ విభిన్నంగా స్పందించారు. వీళ్ల వెర్ష‌న్ ప‌రిశీలించ‌ద‌గిన‌దే. ఇప్పుడు సుశాంత్ విష‌యంలో ముస‌లి క‌న్నీరు కార్చి మైలేజ్ పెంచుకుంటున్న వాళ్లంతా అత‌డికి సాయ‌ప‌డ్డారా? అంటూ సైఫ్ ఖాన్ ప్ర‌శ్నించారు. ఎవ‌రో ఒక‌రిపైనో కొంద‌రిపైనో కోపంతో అంద‌రినీ నిందించ‌కూడ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కంగ‌న .. క‌మ‌ల్ ఆర్.ఖాన్ స‌హా ఎంద‌రో ప‌రిశ్ర‌మ‌లోని ఆ న‌లుగురు లేదా కొంద‌రిని .. అగ్ర నిర్మాత‌ల్ని నిందించ‌డంపై సైఫ్ ఖాన్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని ఖండించారు. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రినీ అణ‌చివేయ‌ర‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో మాట్లాడాల్సిన విష‌యాలు కావ‌ని అన్నారు.

అలాగే అన్నిప‌రిశ్ర‌మ‌ల్లో ఇలాంటి కుట్ర‌లు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొనేందుకు యువ‌ర‌క్తం సిద్ధంగా ఉండాల‌ని మ‌నోజ్ భాజ్ పాయ్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. సుశాంత్ పై ప‌రిశ్ర‌మ‌ కుట్ర కోణం కంటే వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా బ‌లంగా ప్ర‌భావం చూపి ఉండొచ్చ‌ని మ‌నోజ్ భాజ్ పాయ్ విశ్లేషించారు.