బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లిన ఘటనలో ఆటో డ్రైవర్ రానా చేసిన సాహసోపేత చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. బాంద్రాలోని తన ఇంట్లో దాడి అనంతరం గాయాలపాలైన సైఫ్‌ను రానా వెంటనే తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పంజాబీ గాయకుడు మికా సింగ్ రానాను ప్రశంసిస్తూ అతనికి రూ. 1 లక్ష బహుమతిని ప్రకటించాడు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మికా సింగ్ రానాను అభినందిస్తూ, “సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్‌ను కాపాడినందుకు రానా మరింత పెద్ద బహుమతికి అర్హుడు. అతని సాహసోపేత చర్య నిజంగా ప్రశంసనీయమైనది. అతని కాంటాక్ట్ వివరాలు తెలిసిన వారు నాకు పంపిస్తే, నా తరఫున అతనికి రూ. 1 లక్ష బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను” అని తెలిపారు.
సైఫ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో రానాను ప్రత్యేకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. రానాను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పిన సైఫ్, తన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా అతనికి ఆశీర్వాదాలు ఇచ్చారు. సైఫ్ అతనికి రూ. 50 వేల నగదు బహుమతి ఇచ్చినట్లు సమాచారం. జనవరి 16న జరిగిన దాడి తర్వాత సైఫ్‌ను లీలావతి ఆసుపత్రికి రానా తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేశారు.
ఇక దాడి ఘటనలో పోలీసులు దోషిని గుర్తించి జనవరి 19న అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాంను ముంబైలోని థానే ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన పోలీసులు ఐదు రోజుల కస్టడీ పొందారు. రానా చేసిన సేవ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందింది.