‘సర్కార్‌’ వివాదం..ఊహించని కొత్త ట్విస్ట్,అంతా షాక్

ఏ విషయాన్ని అయితే పట్టుకుని సర్కార్ సినిమాపై వివాదం ని మొదలెట్టారో దాని గురించిన క్లారిటీ వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి అని ..ఆ పేరునే సినిమాలో విలన్ పాత్రకు వాడారని, ఆ పాత్రను పూర్తిగా తొలిగించాల్సిందే అంటూ అన్నాడీఎంకే పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా రివీలైన ట్విస్ట్ ఏమిటీ అంటే..అసలు అమ్మపేరు ..కోమలవల్లి కాదు. ఈ విషయం శశికళ మేనల్లుడు దినకరన్ స్పష్టం చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ‘సర్కార్‌’ చిత్రం రిలీజైన నాటి నుంచి వివాదంలో ఉంటూ వచ్చింది.. ఈ చిత్రంలోని విలన్ పాత్ర పేరు మార్చాలంటూ అన్నాడీఎంకే పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు మురుగదాస్‌తో పాటు సర్కార్‌ చిత్రంపైనా మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు డిమాండ్లకు సర్కార్‌ చిత్ర యూనిట్ కూడా దిగొచ్చింది. అయితే ఏఐఏడీఎంకే నేతలు ఆరోపిస్తున్నట్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని శశికళ మేనల్లుడు, ‘అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కజగం’ అధినేత టీటీవీ దినకరన్‌ చెప్పి ఇరు వర్గాలకు షాక్ ఇచ్చారు.

దీనిపై దినకరన్ మాట్లాడుతూ.. ‘అమ్మ అసలు పేరు కోమలవల్లి కాదు. 2002లో ఒకసారి కాంగ్రెస్‌ నేత అమ్మను కోమలవల్లి అని సంబోధించినప్పుడు ఆమె దీనిపై స్పష్టత ఇస్తూ మాట్లాడారు. కోమలవల్లి అనేది తన పేరు కాదని జయలలిత ఎప్పుడో స్పష్టం చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో కూడా ఆ పేరుతో ఎలాంటి పాత్ర పోషించలేదు. ఆమే స్వయంగా స్పష్టత ఇచ్చినప్పుడు ఆరోపణలు అనవసరం. ఒక పాత్రను పేరుని పట్టుకుని అమ్మ పేరుకు ఆపాదించడం అర్థం లేని చర్య’ అని అన్నారు.