ఎందుకిలా.. పెళ్లి గోల .. అంటూ ఏవో చోటా మోటా స్టార్లు నటించిన వెబ్ సిరీస్ లు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముద్ద పప్పు ఆవకాయ్ లాంటి వెబ్ సిరీస్ తో మెగా డాటర్ నిహారిక కొణిదెల బోలెడంత సందడి చేసింది. అటుపై హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ సెన్సేషన్స్ గురించి తెలిసిందే. రీసెంటుగానే ఫ్యామిలీ మ్యాన్ – బ్రీథ్ లాంటి వెబ్ సిరీస్ లు సంచలనం అయ్యాయి. అటుపై వరుసగా థ్రిల్లర్ బేస్డ్ వెబ్ సిరీస్ ల వెల్లువ మొదలైంది. బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లే రంగంలోకి దిగి వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. కానీ టాలీవుడ్ లో కానీ సౌత్ పరిశ్రమల్లో కానీ స్టార్ డైరెక్టర్లు ఆ దిశగా ఆలోచించిందే లేదు.
ఆ కోవలో చూస్తే సౌత్ లో తొలిగా గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ `క్వీన్` అంటూ వెబ్ సిరీస్ ని తెరకెక్కించడం వేడెక్కించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీ.శే జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించగా.. ఇందులో రమ్యకృష్ణ లీడ్ పాత్రను పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత ఏ.ఆర్.మురుగదాస్ సైతం ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించేందుకు సిద్ధమవ్వడం ఆసక్తిని పెంచింది. ఇందులో వాణీ భోజన్ ప్రధాన పాత్రను పోషించనుందన్న టాక్ వినిపించింది. ఈలోగానే మరో స్టార్ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ సైతం వెబ్ సిరీస్ ఆలోచన చేయడం ఆసక్తిని పెంచింది. అక్కినేని హీరో నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ లో నటిస్తారు అనగానే ఒకటే ఆసక్తి నెలకొంది.
ఇక వీరందరి బాటలోనే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం పూరి ఫైటర్ చిత్రీకరణ కోసం వెయిటింగ్. కానీ లాక్ డౌన్ వల్ల సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్ లోనే ఓ రెండు వెబ్ సిరీస్ లకు సంబంధించిన స్క్రిప్టుల్ని రెడీ చేస్తున్నారట. త్వరలోనే సెట్స్ కెళ్లే వీలుందని చెబుతున్నారు. అలాగే హిందీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ నే తెలుగులో పలువురు దర్శకులు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నందిని రెడ్డి.. దేవా కట్టా తదితర దర్శకులు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేయాలంటే ఇతర స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ దిశగా ఆలోచించే వీలుందని అర్థమవుతోంది. మునుముందు కాస్త పెద్ద బడ్జెట్లతోనే మన స్టార్ డైరెక్టర్లు థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తారనే దీనిని బట్టి అర్థమవుతోంది.