కరోనా లాక్ డౌన్ పర్యవసానం ఊహించలేనంత భారీగా ఉంది. ముఖ్యంగా సినీపరిశ్రమలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కార్మికులు ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే నిర్మాతలు సైతం పెట్టిన పెట్టుబడుల్ని ఎలా రాబట్టుకోవాలో అర్థంకాని ధైన్యంలో ఉన్నారు. కరోనా మహమ్మారీ ఇప్పట్లో తగ్గే సన్నివేశం కనిపించకపోవడంతో లాక్ డౌన్ ఎత్తేసినా జనం థియేటర్లకు వస్తారా? అన్న సందిగ్ధత అలానే ఉంది.
ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ నిర్మాతలకు ఊరట కలిగించేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయి? అన్నది చర్చకొచ్చింది. అయితే అన్నిటికీ రేపటి సినీపద్దలు -ప్రభుత్వాధీశుల మీటింగ్ ఒక సొల్యూషన్ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ మీటింగులో ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి సహా కార్మికుల ఉపాధి అంశం కీలకంగా చర్చకు రానుంది. సూపర్ స్టార్ల పారితోషికాల కోత సహా పెద్ద టెక్నీషియన్ల నుంచి ప్రతి ఒక్కరూ పారితోషికాలు తగ్గించుకునేలా ఒత్తిడి తేనున్నారట. దీనిపై చర్చ సాగుతుంది. షూటింగులు ఎప్పటి నుంచి చేయాలి? థియేటర్లు ఎప్పుడు తెరవాలి? అన్నదానిపైనా రేపు ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే బుల్లితెర పెద్ద తెర షూటింగులు నిలిచిపోవడంతో తీవ్ర సంక్లిష్ఠత నెలకొంది. ఆ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమకు సాయం చేసేందుకు ముందుకు వస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈనెల 17 వరకూ తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అప్పటివరకూ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ షూటింగులు కానీ అనుమతులు లేవు. అలాగే థియేటర్లను ఓపెన్ చేసే సాహసం ఇప్పట్లో కనిపించడం లేదు. బహుశా జూన్ నుంచి వెసులుబాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా రేపటి కీలక భేటీ అన్నిటినీ డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు. నిర్మాతలు ముందుగా చర్చించుకుని ఫార్మాట్ ఎలా ఉండాలన్నది ప్రభుత్వానికి తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.