అక్కడ ఉన్నది స్టార్ హీరో అయినా.. మీడియం రేంజ్ హీరో అయినా.. ఎవరైనా కూడా తమకు వర్కౌట్ కాదు అంటే నిర్మొహమాటంగా సినిమాలను ఆపేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్‌లో రావాల్సిన గాంజా శంకర్ సినిమాను ఆదిలోనే ఆపేశారు సితార ఎంటర్ టైన్ మెంట్స్ దీనికి కారణం. ఆ సినిమా బ్జడెట్ ఇష్యూస్ అని తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం దాదాపు 15 కోట్ల రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలుస్తుంది. అలాగే ఫైనల్ బ్జడెట్ పేపర్ మీదే 60 కోట్ల వరకు పెరగడంతో.. నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడి ఆపేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి విషయమే గోపీచంద్ మలినేని, రవితేజ సినిమాకు కూడా జరిగింది. 3 హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ అయినా కూడా బ్జడెట్ వర్కవుట్ కాకపోవడంతో.. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతోనే ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్.
ఇదే సినిమాను అజిత్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. ఇక నాని, తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాను కూడా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి బ్జడెట్ కారణంగానే ఆపేశాడు. ఈ సినిమాకు 100 కోట్లు అవుతుందని దర్శకుడు చెప్పడంతో.. నాని మీద అది వర్కౌట్ అవ్వదని వెనక్కి తగ్గాడు నిర్మాత.
కేవలం ఇవి మాత్రమే కాదు. ఇంకా చాలా సినిమాలు బయటికి రాకుండా ఆగిపోవడానికి కారణం బడ్జెట్ మాత్రమే. విజువల్ వండర్స్ అయితే ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా నిర్మాతలు రెడీగా ఉంటారు. కానీ రొటీన్ కమర్షియల్ సినిమాల కోసం కూడా 60 నుంచి 100 కోట్లు పెట్టాలి అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అందుకే నిర్మొహమాటంగా ఆ సినిమాలను ఆపేస్తున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు విశ్లేషకులు. దీని వల్ల దర్శకులు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని బ్జడెట్ లెక్కలు చెప్తారు.