ఇన్నాళ్లు బెట్టు చేశారు. ఓటీటీ డిజిటల్ అంటేనే చిన్న చూపు చూశారు. కానీ తాజా సన్నివేశం చూస్తుంటే బెట్టు చేయడం సరికాదని అప్పుల తిప్పలు తగ్గేందుకు ఆస్కారం లేదని అర్థమవుతోంది. వైరస్ క్రైసిస్ అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు బెట్టు వీడి వరుసగా డిజిటల్లో సినిమాల రిలీజ్ లకు నిర్మాతలంతా సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో డజను పైగా చిత్రాలు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయని సమాచారం.
తొలిగా దిల్ రాజు నిర్మించిన `వి`ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. నాని-సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన క్రేజీ మూవీ ఇది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అటుపైనా అనుష్క – నిశ్శబ్ధం రిలీజ్ కి ఏర్పాట్లు సాగుతున్నాయట. వైష్ణవ్ తేజ్ – ఉప్పెన .. రామ్ – రెడ్.. రవితేజ – క్రాక్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయని నిర్మాతలు డీల్స్ ఫైనల్ చేసే పనిలోనే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ బయటికి తెలిసినవి. ఇంకా పలువురు నిర్మాతలు ఓటీటీలతో చర్చల్లో ఉన్నారట.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. రామ్ `రెడ్` నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. ఇతర సినిమాల్లో కొన్ని నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. వీళ్లంతా ఓటీటీలకు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే అగ్ర హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. కోలీవుడ్ మాలీవుడ్ అదే బాటలో ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ అదే దారిలోకొస్తోందన్నమాట. ఇది ఓటీటీ- తెలుగు అభిమానులకు పసందైన వార్తనే.