కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగులు జరక్క.. థియేటర్లు రన్ అవ్వక నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. తిరిగి థియేటర్లు ఓపెన్ అయ్యేదెపుడు? జనం థియేటర్లకు వచ్చేదెపుడు? అసలు సెట్స్ కెళ్లేదెపుడు? ఇవన్నీ పజిల్స్ గా మారాయి. ఆ క్రమంలోనే అన్ని పరిశ్రమల్లానే టాలీవుడ్ పైనా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్ట్ కటింగ్ ఫ్యాక్టర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇప్పటికిప్పుడు సెట్స్ పై ఉన్న.. అలాగే సెట్స్ కి వెళ్లబోతున్న సినిమాలకు కాస్ట్ కటింగ్ ని అప్లయ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ పర్యవసానం స్టార్ల పారితోషికాలపై తీవ్రంగా పడనుంది. అలాగే పెద్ద పారితోషికాలు అందుకునే టెక్నీషియన్ల పారితోషికాల్ని కోసేయనున్నారని ఓ ప్రముఖ నిర్మాత వెల్లడించారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా పెద్ద పారితోషికాలు అందుకునే వారికి కంపెనీలు కోత పెడుతున్నాయి. అదే తీరుగా పరిశ్రమలోనూ హీరోలు.. హీరోయిన్ల పారితోషికాల్ని కోసేయనున్నారట.
ఇక హీరోల మాట అటుంచితే ఇప్పటికే లక్షల్లో పారితోషికాలు అందుకుంటున్న హీరోయిన్లు కోటికి పడగలెత్తిన హీరోయిన్లకు కోత పడిపోనుందని తెలుస్తోంది. ముఖ్యంగా వరుస సక్సెస్ లతో దూసుకొచ్చి తెలుగు-తమిళంలో రైజింగ్ స్టార్ గా పాపులరవుతున్న రష్మిక మందనకు ఈ కాస్ట్ కటింగ్ ఇబ్బందికరంగా మారిందట. ఇప్పటికే ఈ అమ్మడు కోటి నుంచి 2కోట్ల మధ్య పారితోషికాలు పెద్ద సినిమాలకు డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటి పరిస్థితిని బట్టి తిరిగి లక్షల పారితోషికంతో సరిపెట్టుకోవాల్సి వస్తోందట. రష్మిక ప్రస్తుతం తమిళంలో కార్తీతో ఓ చిత్రం చేస్తోంది. తెలుగులో బన్ని సరసన పుష్పలో నటిస్తోంది. ఇక కేవలం రష్మిక వరకేనా అంటే ఇతర స్టార్ హీరోయిన్లు.. భామలకు కాస్ట్ కటింగ్ ని అప్లయ్ చేయనున్నారని గుసగుస వినిపిస్తోంది. నిర్మాతల్లో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.