గాల్వానా లోయలో చోటు చేసుకున్న ఇండియా-చైనా ఆర్మీల ఘర్షణ నేపథ్యం దేశంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందో తెలిసిందే. 20 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న చైనాపై పగతీర్చుకోవాలని దేశం మొత్తం కసితో రగిలిపోతుంది. సమరానికి సై అంటూ భారత్ సైతం కయ్యానికే కాలు దువ్వింది. దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు..తూటాకి తూటా బధులిచ్చి బుద్ది చెప్పాల్సిందే నని డిసైడ్ యుద్దానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు పూర్తిగా మద్దతు పలికారు. చైనా వస్తువులన్నింటినీ బ్యాన్ చేయాలని ప్రజలంతా పిలుపునిచ్చారు. దాదాపు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు చైనాకు బుద్ది రావాలంటే ఆ దేశం మార్కెట్ ను దెబ్బ కొట్టడమే సరైన మార్గమని భావించారు.
బ్యాన్ చైనా అంటూ సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. అన్ని పరిశ్రమలు బ్యాన్ చైనాకు ఓటేసాయి. రైల్వే శాఖ చైనాతో కీలక ఒప్పందాల్నీ రద్దు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం వేటుకు రంగం సిద్ధం చేసింది. కొందరు బాలీవుడ్ హీరోలు కూడా చైనా ఉత్పత్తుల నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే కొంత మంది టాలీవుడ్ హీరోలు మాత్రం దీనిపై ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం శోచనీయం. తెలుగు హీరోలు, హీరోయిన్లు కూడా కొంత మంది చైనా వస్తువులకు ప్రచాకర్తలగా వ్యవహరిస్తున్నారు. వీటి ద్వారా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న మాట వాస్తవం.
కానీ గాల్వానా ఘటన అమరులైన సైనికుల విషయంలో టాలీవుడ్ హీరోలు మాత్రం కేవలం నివాళులు అర్పించారు తప్ప! తమ ప్రకటనలు వదులుకుంటున్నట్లుగానీ, బ్యాన్ చైనా ఉద్యమానికి మద్దతు తెలిపినట్లుగానీ ఎక్కడా రాలేదు. చైనా వస్తువుల వాడకం పైకూడా ఏ హీరో స్పందించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఏ హీరో కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్న ట్లు కనిపించలేదు. దీంతో టాలీవుడ్ హీరోలపై వ్యతిరేక గళం వ్యక్తం అవుతోంది. హీరోలు చైనా వస్తువుల బ్యాన్ కు మద్దతు పలికితే తమ ప్రాజెక్ట్ లను స్వచ్ఛందంగా వదులుకోక తప్పదు.