టాలీవుడ్ యూట‌ర్న్..టాలెంట్‌కి రైట్ ట‌ర్న్‌!!

తెలుగు సినిమాకి మంచి రోజులు

తెలుగు సినిమాకి మంచి రోజులు మొద‌ల‌య్యాయి. జ‌క్క‌న రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి` తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చాటింది. గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తిని ఆర్జించిన టాలీవుడ్ యూట‌ర్న్ తీసుకుంది. టాలెంట్‌కి రైట్ ట‌ర్న్‌గా మారింది. తొలి టాకీ `భ‌క్త ప్ర‌హ్ల‌ద` నుంచి నిన్న మొన్న‌టి `మ‌హాన‌టి` వ‌రకు తెలుగు తెర‌పై అజ‌రామ‌ర‌మైన చిత్రాలొచ్చాయి. ప్ర‌పంచ య‌వ‌నిక‌పై తెలుగు వాడి కీర్తిప‌తాకాన్ని ఎగుర‌వేశాయి. మ‌న మేక‌ర్స్ కూడా కాలానికి అనుగుణంగా కొత్త త‌ర‌హా చిత్రాల‌తో ఎప్ప‌టి క‌ప్పుడు కొత్త ట్రెండుకు శ్రీ‌కారం చుడుతూనే వున్నారు. అలా చేసిన ప్ర‌తీసారి తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించి వారిని ప్రోత్స‌హిస్తూనే వున్నారు. 
 
అయితే గ‌త కొన్నేళ్లుగా తెలుగు సినిమా మూస ధోర‌ణికే అల‌వాటుప‌డిపోయింది. తెలుగు సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమా.. కాసుల కోసం వేట అన్న ముద్ర ప‌డిపోయింది. జాతీయ స్థాయిలో అయితే తెలుగ సినిమా అంటే పెద‌వి ఇవిరిచే ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది. అయినా మ‌న మేక‌ర్స్ తీరు మార‌లేదు. ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఐదు ఫైట్లు, ఆరు పాట‌లు. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌ల‌తో రొటీన్ సినిమాల‌ని ప్రేక్ష‌కుల‌పై రుద్ద‌డం మొద‌లుపెట్టారు. అయితే ప్రేక్ష‌కుల్లో మార్పు వ‌చ్చింది. అలా వ‌చ్చే మూస చిత్రాల్ని స్టార్ హీరో న‌టించినా నిర్ధాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేయ‌డం మొద‌లైంది. దీంతో మేక‌ర్స్‌లో, హీరోల్లో మార్పు మొద‌లైంది. అక్క‌డి నుంచే ఓ `రంగ‌స్థ‌లం` లాంటి సినిమా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోలు కూడా మూస చిత్రాల‌కు భిన్నంగా అడుగులు వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌నే సంకేతాల్ని అందించి టాలీవుడ్‌కు కొత్త దిశను నిర్దేశించింది. 
 

టాలీవుడ్ యూట‌ర్న్.. కొత్త జోన‌ర్‌ల‌కి వెల్‌కం


 
ఇక్క‌డి నుంచే ప్రేక్ష‌కుల‌తో పాటు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మూస క‌థ‌ల నుంచి యూట‌ర్న్ తీసుకుని కొత్త జోన‌ర్‌ల‌కి వెల్‌కం చెప్ప‌డం మొద‌లుపెట్టారు. దీంతో గ‌డిచిన రెండేళ్ల‌లో టాలీవుడ్ లో ఇండియా అంతా గొప్ప‌గా చెప్పుకునే చిత్రాల ఒర‌వ‌డి మొద‌లైంది. దీంతో టాలీవుడ్ ఖ్యాతి పెరిగి ఇండియ‌న్ సినిమాలోనే మొద‌టి స్థానంలో గ‌ర్వంగా నిలిచేలా చేసింది. దీంతో తెలుగులో క‌మర్షియ‌ల్ క‌థ‌ల‌కు కాలం చెల్లిపోయింది. ఎంత టాప్ హీరో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసినా దాన్ని ఆద‌రించ‌లడం లేదు. కంటెంట్ లేక‌పోతే స్టార్ హీరో సినిమా అయినా స‌గ‌టు ప్రేక్ష‌కుడు డోంట్ కేర్ అంటున్నాడు.  కంటెంట్ వున్న సినిమాకే అగ్ర‌తాంబూలం ఇస్తున్నాడు. 
 
ఇందుకు ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకున్న కేరాఫ్ కంచర‌పాలెం, మ‌జిలీ, జెర్సీ, మ‌హ‌ర్షి, క‌ల్కి, బ్రోచేవారెవ‌రురా, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌, ఓ బేబీ చిత్రాలే ఇందుకు నిద‌ర్శ‌నం. మారుతున్న కాలాన్ని బ‌ట్టి ప్రేక్ష‌కుడి అభిరుచి కూడా మారింది. హీరో గాల్లోకి నేల విడిచి సాము చేస్తానంటే ఎవ‌రూ చూడ‌టం లేదు. వాస్త‌విక‌త నేప‌థ్యంలో అర్థ‌వంత‌మైన క‌థ‌ల‌తో రూపొందుతున్న చిత్రాల‌కే ఎక్కువ‌గా ప‌ట్టం క‌డుతున్నారు. ఇది టాలీవుడ్‌కు శుభ‌ప‌రిణామం. దీని వ‌ల్ల కొత్త టాలెంట్ మరింత‌గా బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంది. దాంతో కొత్త త‌ర‌హా సినిమాలు వెలుగులోకి వ‌స్తాయి. ఆ దిశ‌గా టాలీవుడ్ అడుగులు వేస్తే కొత్త టాలెంట్‌ని ప్రోత్స‌హించాల‌ని ఆశిద్దాం.