తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) రెండుగా విడిపోనుందా? అందుకు సింప్టమ్స్ కనిపిస్తున్నాయా? అంటే అవుననే పరిశ్రమ ఇన్ సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆరేళ్లుగా ఏపీ- తెలంగాణ డివైడ్ ఫ్యాక్టర్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. అయితే అది సందర్భాన్ని బట్టి బయటపడుతోంది. అణగారిన తెలంగాణ సినీవర్గాలు తెలంగాణ పోరాట సమయంలో ఎలా స్పందించాయో ఇప్పుడు కూడా అలానే ఎటాక్ చేసేందుకు సిద్ధమవుతుండడం చూస్తుంటే ఇది భవిష్యత్ పరిణామానికి సింబాలిక్ అన్న సందేహాలు అలుముకున్నాయి.
ఒకరకంగా టాలీవుడ్ లో నిప్పు – ఉప్పు వర్గాలు ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వేడెక్కుతూనే ఉన్నాయి. ఒకరితో ఒకరు బాహాబాహీకి సైతం సిద్ధంగా ఉన్నారంతా. ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్దరికంపైనా ఇప్పటికే పలువురు ప్రశ్నలు సంధిస్తుండడంతో ఇదేదో కయ్యానికి కాలు దువ్వుతున్న వ్యవహారంగానే కనిపిస్తోంది. అంతెందుకు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. సినిమాటోగ్రఫీ మంత్రులతో సమావేశానికి చిరంజీవి ఒక్కరే వెళ్లారని.. ఆయన తెలంగాణ రాష్ట్ర సినిమా పరిస్థితుల్ని చెప్పేందుకు సీఎంని కలిస్తే తమ ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ప్రముఖ తెలంగాణ నిర్మాతలు లేదా ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎవరినీ ఎందుకు ఆహ్వానించలేదని కూడా సునీల్ నారంగ్ లాంటి పెద్ద మనిషి ప్రశ్నించారు. అంతేకాదు.. తెలంగాణ ప్రముఖ హీరో తండ్రిని అయినా కనీసం ఆహ్వానించలేదే! అని రంధ్రాన్వేషణ చేయడం చూస్తుంటే తెలంగాణ విస్మరించబడిందా? అన్న సందేహం రాజుకుంటోంది.
ఇంకా చెప్పాలంటే ఆంధ్రా పాలకుల వల్ల ఎంతో నష్టపోయామన్న తెలంగాణ వాదులు ఇప్పటికీ తెలంగాణ సినిమా ఎంతో నష్టపోతోందన్న కొత్త వాదనకు తెర తీసినట్టయ్యింది. మెగాస్టార్ చిరంజీవి కానీ.. ఇతర ప్రతినిధులు కానీ ఆంధ్రా పరిశ్రమ తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారు తప్ప తెలంగాణ సినిమా సమస్యల్ని ప్రస్థావించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇక తెలంగాణలో ఉన్న 400 పైగా థియేటర్లు.. ఇతర మల్టీప్లెక్స్ థియేటర్ల సమస్యల గురించి సీఎం కేసీఆర్ వద్ద ప్రస్థావించాలంటే .. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని పిలవాలి కదా? ఎవరినీ సంప్రదించకుండానే చిరంజీవి తనకు నచ్చిన వాళ్లను తీసుకుని వెళ్లి సిఎమ్ ను కలవడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. చాంబర్ కి అనుబంధంగా ఉన్న నాలుగు సెక్టార్లలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలు, థియేటర్లు ఎవరినీ పిలవలేదన్న వాదనా ఓ ప్రముఖుడు బయటికి తెవడం వేడెక్కిస్తోంది. తెలంగాణలో చక్రం తిప్పుతున్న వాళ్లందరినీ తొక్కేస్తున్నారన్న ఆవేదన కూడా తాజా ఆక్రోశంలో వ్యక్తమైంది.
తెలంగాణ చాంబర్ మాత్రమేనా తెలుగు ఫిలిం చాంబర్ ను కూడా చిరంజీవి బలగాలు దూరం పెట్టాయన్న ఆవేదనా ఇక్కడ వ్యక్తమైంది. ఎన్ శంకర్ ని వెంటేసుకుని సీఎంని కలిసేప్పుడు తమకు చెప్పాలి కదా? అన్న స్వరం బలంగా వినిపించింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తో మరో టాలీవుడ్ నిర్మాణం కోసం సన్నాహాలు చేస్తున్నారని అది విశాఖ పట్నం కేంద్రంగా ఉంటుందని ఇప్పటికే కథనాలు వేడెక్కించాయి. ఈ నేపథ్యంలోనే చిరు వ్యవహార శైలిపై తెలంగాణ సినీప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సినిమాలు తీసే యాక్టివ్ నిర్మాతల గిల్డ్ లో అల్లు అరవింద్ – దిల్ రాజు సహా పలువురు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితులు కావడంతో వైజాగ్ టాలీవుడ్ నెలకొల్పడం పెద్ద సమస్యాత్మకం కాదన్న వాదనా తెరపైకి వచ్చింది.