Mega Politics : చిరంజీవి మెగా రాజకీయం.! ఆ రిస్క్ మళ్ళీ తీసుకుంటారా.?

Mega Politics : అలా జరుగుతుందా.? జరగదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారన్న గుసగుసలు అయితే ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి ఈసారి. ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి ‘అందరివాడు’గానే వున్నారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.

తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి ఇంతవరకు బాహాటంగా మద్దతు పలికింది లేదు. అన్నయ్యగా తమ్ముడి రాజకీయ భవిష్యత్తు బావుండాలని ఆశీస్సులు మాత్రమే అందిస్తారు. ఏమో, వ్యక్తిగతంగా అన్నదమ్ముల మధ్య జరిగే చర్చల్లో, జనసేన పార్టీకి విలువైన సూచనలు చిరంజీవి ఇస్తారేమో.!

అయితే, మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడైతే జనసేనలో యాక్టివ్ అయ్యారో, చిరంజీవి ప్రస్తావన కూడా ఖచ్చితంగా వస్తోందిప్పుడు. జనసేన పార్టీకి తెరవెనుక అండదండలందించేందుకు చిరంజీవి సిద్ధంగా వున్నారంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

మరోపక్క, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి పేరుని బీజేపీ ప్రతిపాదిస్తోందనీ, ఈ విషయమై ఇప్పటికే జనసేనానితో కూడా చర్చించడం జరిగిందనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవిని బీజేపీలోకి కొందరు బీజేపీ పెద్దలు ఆహ్వానించినప్పటికీ, చిరంజీవి ఆ ఆహ్వానాల్ని గతంలోనే సున్నితంగా తిరస్కరించారు.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో పలు ప్రెస్టీజియస్ సినిమాలున్నాయి. వాటి పనుల్లో బిజీగా వున్న చిరంజీవి, రాజకీయాలకు సమయం కేటాయించే అవకాశమే లేదు. కానీ, ఆల్రెడీ రాజకీయ తెరపై ఓసారి మెరిసిన చిరంజీవి, ఇంకోసారి మెరవాలనుకుంటే.. పరిస్థితులు అనుకూలిస్తే.!