మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారట.! చాలాకాలంగా వినిపిస్తున్న ‘గాసిప్’ ఇది. ఈసారి ఇంకాస్త గట్టిగా వినిపిస్తోందంతే. ‘నాకు రాజకీయాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. సినీ నటుడిగా కొనసాగుతూ, బాధ్యతగల పౌరుడిగా ప్రజలకు సేవ చేసేందుకు ఎటూ సేవా మార్గం నాకు వుండనే వుంది..’ అంటూ పలు సందర్భాల్లో చిరంజీవి చెబుతున్నా, ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రావడానికి ‘పరిస్థితులు డిమాండ్ చేయడం’ అనేది పెరిగిపోతోందట.

2009 ఎన్నికల్లో చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ ద్వారా తెలుగునాట సందడి చేసిన సంగతి తెలిసిందే. అలా ఆయన రాజకీయాల్లోకి రావడానికి కూడా తెరవెనుకాల చాలా ‘ఒత్తిళ్ళు’ పని చేశాయి. ఇప్పుడు అంతకు మించిన ‘ఒత్తిళ్ళు’ షురూ అవుతున్నాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే, గత అనుభవాల నేపథ్యంలో చిరంజీవి అస్సలేమాత్రం, ‘పొలిటికల్ రీ-ఎంట్రీ’కి సుముఖత వ్యక్తం చేయడంలేదట. జనసేనలో చేరి పవన్ కళ్యాణ్‌కి అండగా నిలవాలంటూ చిరంజీవిపై ఒత్తిడి బాగా ఎక్కువ వస్తోందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా చిరంజీవికి ఆహ్వానాలు అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవికి పిలుపు గురించి కొత్తగా చెప్పేదేముంది.?

సినీ పరిశ్రమలో ఇటీవల మారిన రాజకీయాలు, తెలుగునాట చోటు చేసుకుంటున్న ఆసక్తికరమైన రాజకీయ మార్పులు.. వీటన్నిటి నేపథ్యంలో చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావడమే మంచిదన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో ఆయన్ని అభిమానించే కొందరి నుంచి వినిపిస్తోంది.

అయితే, ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు గుర్తున్నవారెవరూ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడంలేదు.