సినిమాలో వేషం ఇప్పిస్తానని మోసం చేయటం సినీ పరిశ్రమ పుట్టిన నాటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. అయితే పేరు,క్రేజ్ ఉన్న దర్శకులు ఎవరూ అలాంటి పనులు చేసి పేరు పోగొట్టుకోరు. కానీ ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇప్పుడు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా విశాల్‌తో ‘తుప్పరివాలన్’ (డిటెక్టివ్) ను తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు మిష్కిన్. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రంపై ఆసక్తి పెరిగింది.
ఉదయనిధి హీరోగా ‘సైకో’ అనే కొత్త చిత్రాన్ని రూపొందించనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. ఇందులో అతిథిరావు, నిత్యామేనన్‌లు హీరోయిన్స్. పోలీసు అధికారి పాత్రలో దర్శకుడు రామ్ నటిస్తున్నారు. అంతాబాగానే ఉంది. షూటింగ్ కూడా మొదలై శరవేగంగా జరుగుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు.
అయితే దర్శకుడు మిష్కిన్ తనను మోసగించారని నూతన నటుడు మైత్రేయ ఆరోపించారు. దీనిగురించి ఆయన మాట్లాడుతూ ‘2015లోనే ‘సైకో’ సినిమా గురించి మిష్కిన్‌తో చర్చించాం. నా కోసమే ఆ కథను సిద్ధం చేసినట్లు మిష్కిన్ చెప్పారు.
ఆ సినిమా కోం అడ్వాన్స్ గా నా తండ్రి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. అయితే ‘సవరకత్తి’, ‘తుప్పరివాలన్’ సినిమాల కోసం కొంత సమయం కావాలని అడిగారు. ఈ రెండూ పూర్తయ్యాక ‘సైకో’ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరో హీరోతో సినిమాను తెరకెక్కిస్తున్నారు అని వాపోయారు.
దీనిగురించి మేము మిష్కిన్‌ను ప్రశ్నించగా.. ‘మీతో సినిమా చేయడం వీలుకాదు. అడ్వాన్స్ కూడా ఇవ్వలేను’ అని చెబుతున్నారు. చాలా మంది కోర్టు కు వెళ్లమని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని మిష్కిన్ విజ్ఞతకే వదిలేస్తున్నామనని’ చెప్పుకొచ్చారు.