హమ్మయ్య… త్వరలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయోచ్. ఇక సినిమా అభిమానుకు పండగే. మామూలు పండుగ కాదు. ఇన్నిరోజులు మిస్సయిన ఎంటర్ టైన్ మెంట్ ఇప్పుడు దొరకనుంది. మార్చి 25 నుంచి లాక్ డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బొమ్మ పడింది లేదు. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ లాక్ 3.0 త్వరలో ముగుస్తుండటంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్రం కొత్త మార్గదర్శకాల్లో మొదటిది… థియేటర్లు తెరుచుకోవడం.. ఇక నుంచి థియేటర్లు తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. సినిమా షూటింగులకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.
కేంద్రం ఇదివరకు విధించిన అన్ లాక్ 3.0 ఆగస్టు 31తో ముగియబోతోంది. దీంతో ఆగస్టు 31 తర్వాత సినిమా హాళ్లను తెరుచుకోవచ్చని… సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్ లకు కూడా అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఈసందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ… కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే షూటింగులు గట్రా జరుపుకోవాలని సూచించారు. థియేటర్ల యాజమాన్యం కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షోలను వేసుకోవాలని తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు ఇవే
కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. సినిమా షూటింగ్ ల సమయంలో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే. దానితో పాటు షూటింగ్ సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించాలి.
సినిమా షూటింగ్ లకు సందర్శకులకు అనుమతి లేదు. సాంకేతిక సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. థియేటర్లలోనూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీట్లను కేటాయించాలి. సినిమా హాళ్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ అనుమతి రావడంతో కొన్ని షూటింగ్ లు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక మిగిలింది థియేటర్లు ప్రారంభం కావడమే. సినిమా హాళ్ల రీఓపెన్ కోసం సినీ అభిమానులు కళ్లకు ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.