తెలుగు ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఒక రకంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినా మన స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ ఆదుకుంటున్నారు. కేవలం తమ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో ఆ నలుగురు సహా పరిశ్రమ పెద్దలంతా ఏకమై రకరకాల నిధి సేకరణ కార్యక్రమాలతో గతంలో ఆదుకున్న సన్నివేశం చూశాం. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో టాలీవుడ్ స్పందన అద్భుతంగా ఉంది. స్టార్లు ఇప్పటికే కోట్లాది రూపాయల విరాళాల్ని సీఎం నిధి.. పీఎం నిధి సహా సినీకార్మికుల సీసీసీ ఫండ్ కి జమ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆదుకునేందుకు పది చేతులు ముందుకొచ్చాయి. అయితే ఇది సరిపోతుందా? సినీపరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న 24 శాఖల్లో వేలాది మంది కార్మికులు ఇప్పుడు ఏ దిక్కు తోచని సన్నివేశంలో ఉన్నారు. ఉప్పు పప్పులు అయినా అందకుండా పట్నాల్లో లాక్ అయిన కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో దిగ్భంధనంలో ఉన్నారు.
అయితే ఇలాంటి వేళ టాలీవుడ్ పేరుతో కోట్లాది రూపాయల ఆర్జన చేసిన ఆ నలుగురు.. నిర్మాతల గిల్డ్ కానీ.. కథానాయికలు కానీ సరిగా స్పందించనే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కరు కూడా విరాళం ఇచ్చింది లేదే! అన్న విమర్శలు వెల్లువెత్తాయి. కథానాయికల్లో ఒక్క నయనతార 20 లక్షల డొనేషన్ ఇవ్వడం తూతూ మంత్రమేనన్న విమర్శ వెల్లువెత్తింది. ఇక ఇతర కథానాయిక లు విరాళాలేవీ? అంటూ విమర్శలొచ్చాయి. అంతేకాదు.. సినిమా 24 శాఖల కార్మికుల కోసం కానీ.. లేదా సామన్య ప్రజలను ఆదుకునేందుకు కానీ సినీ నిర్మాతలు.. ఆ నలుగురు.. సపరేట్ కుంపటి ఏం చేస్తోంది? అంటే దానిపైనా రకరకాల విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లను గుప్పిట పట్టి.. ఎగ్జిబిషన్.. పంపిణీ రంగాల్ని బంధించిన ఆ నలుగురు ఇలాంటి వేళ చేసింది తీసికట్టుగానే ఉందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ఇక ఉన్నంతలో డి.సురేష్ బాబు – వెంకటేష్ కాంపౌండ్ .. దిల్ రాజు వంటి వారు తలో కోటి చొప్పున విరాళం ఇచ్చి ఏదో మమ అనిపించేశారు. ఇతరుల్లో ఏవో చిన్నా చితకా సాయాలు చేశారు తప్ప తమ స్థాయికి తగ్గ సాయం చేశారన్న ప్రశంస అయితే దక్కలేదు. ఇకపోతే మరీ విచిత్రంగా నిర్మాతల మండలిలో 1000 పైగా నిర్మాతలు ఉండగా.. వీళ్లలో ఈ విపత్తు వేళ ఆదుకునేందుకు ముందుకొచ్చింది అతి కొద్ది మంది మాత్రమే. కొందరు సొంత నిర్మాణ సంస్థ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరుగా ఉంది. పూర్తి స్థాయిలో కార్మికుల్ని ఆదుకునేందుకు తమ సంస్థను నమ్మి పని చేసేవాళ్లను ఆదుకోవాల్సిన సందర్భమిది. ఇక ఈ విషయంలో మెగా కాంపౌండ్ ఒక మెట్టు పైనే ఉంది. తమను నమ్మిన కార్మికుల్ని ఆదుకునేందుకు చిరు చాలానే సాయం అందిస్తున్నారని తెలిసింది. తారక్.. ప్రభాస్ లాంటి స్టార్లు ఈ తరహాలో ఆదుకునే తత్వం ఉన్నవాళ్లే. ఇక మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ఈ కష్టకాలంలో తిండి లేని నిర్మాతలకు సాయం అందిస్తాం అని ప్రకటించడం హాస్యాస్పదమైంది. నిర్మాత అంటేనే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేవాళ్లు. లాభాల్లేకపోవచ్చు.. కనీసం ఇతర మార్గాల ఆదాయ ఆర్జన ఉంటుంది. బతికేందుకు లేనంత ఉంటుందా? అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆసక్తికరంగా లక్ష సాయం అంటూ ప్రకటించి అటుపై 10వేలకు దించేశారు. ఆ పది వేల కోసం వంద మంది పోటీపడుతుండడం సిగ్గు చేటుగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీ పెద్దల్లో డి.సురేష్ బాబు – దిల్ రాజు ఇంకా సాయం పెంచాల్సి ఉంటుందని కోరుతున్నారు.
ఇక అగ్ర నిర్మాణ సంస్థల్లో ఎప్పుడూ పేరు వినిపించేవి మరో రెండు సంస్థలు ఉన్నాయి. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్.. ప్రభాస్ స్నేహితుల బృందం యు.వి.క్రియేషన్స్ తాజా కల్లోలంపై స్పందించలేదేమిటో? ఇంతకీ సదరు నిర్మాతలు కం ఎగ్జిబిటర్ కం పంపిణీ దిగ్గజాలు టాలీవుడ్ కి .. సామాన్య ప్రజలను ఆదుకునేందుకు ఏ మేరకు సాయం చేస్తున్నారు? అన్నది ఇప్పటివరకూ సస్పెన్స్ గానే మారింది. అలాగే `అలా మొదలైంది` దాము-నారంగ్ దాస్ -బూరుగు పల్లి వంటి యాక్టివ్ గిల్డ్ నిర్మాతలు ఎవరికి ఏం సాయం చేశారు? అన్నది తెలియాల్సి ఉంది. ఆ పది మందితో ఉన్న సపరేట్ కుంపటి ఏం చేసింది ఇండస్ట్రీకి? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. చిరు సారథ్యంలోని సీసీసీకి వీళ్లంతా ఏం చేస్తున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.