తెలుగు ప్రేక్షకుల బుల్లితెర వీక్షణ అభిరుచి మారుతోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇంతకుముందుతో పోలిస్తే తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకు విశేషమైన ఆదరణ పెరిగిందని తాజాగా రిలీజ్ చేసిన బార్క్ టీఆర్పీ రేటింగ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా టీవీఆర్ రేటింగ్స్ ప్రకారం.. జెమిని టీవీ తెలుగు టీవీ ఛానెళ్లలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ వారం టాప్ -5 టివిఆర్ (యు + ఆర్) రేటింగ్స్ చూస్తే – మహర్షి (8.86), విజిల్ (6.87), రాజా (6.36), ఠాగూర్ (5.61), .. బాహుబలి – ది కన్‌క్లూజన్ (5.02) రేంజులో ఉన్నాయి. బాహుబలి -2 మినహా మిగతావన్నీ జెమిని టివీలో ప్రసారం చేసినవి. ఈ రేటింగ్స్ చూస్తుంటే.. బుల్లితెరపై సినిమాల వీక్షణ అమాంతం పెరిగిందనే అర్థమవుతోంది. కరోనా ముందు కరోనా తర్వాత అని విభజిస్తే.. ఇంతకుముందుతో పోలిస్తే టీవీల్లో సినిమాలు చూడడం పెరిగిందని ఈ టీర్పీలు వెల్లడిస్తున్నాయి.
తాజా టీర్పీల్ని బట్టి.. వరుసగా మూడు వారాల పాటు మొదటి స్థానంలో ఉన్న ఈటివి ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. లాక్ డౌన్ ప్రారంభ రోజుల్లో, న్యూస్ బులెటిన్లను ప్రసారం చేసిన ఈటీవీ తెలుగు, మూడు వారాల పాటు మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా సీన్ మారింది. తెలుగు ప్రజల చూపు వేరే చానెళ్ల వైపు మళ్లింది. ఎంతసేపూ కరోనా వార్తల విచారమేనా? అందుకేనేమో.. వినోదం ప్రధానం అనుకుంటున్నారు. ఠాగూర్, రాజా వంటి పాత చిత్రాలకు మంచి రేటింగ్స్ రావడం చూస్తుంటే జనం ఎంతగా మారారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి వీకెండ్ టీఆర్పీలు ఇకపై ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే బావుంటాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ ని మే నెలాఖరువరకూ పొడిగించారు. ఏపీలోనూ ఇదే సన్నివేశం కనిపిస్తోంది ఇప్పటికీ. ఇది బుల్లితెర వీక్షణకు ఆసరా అవుతోంది.