షూటింగుల అనుమ‌తి జీవోలో మ‌త‌ల‌బు

tollywood

జూన్ 15 నుంచి షూటింగులు నిరాఠంకంగా జ‌రుపుకునేందుకు తెలంగాణ‌- ఏపీ ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తో .. ఏపీ సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ స‌హా సినీపెద్ద‌ల భేటీ స‌ఫ‌ల‌మైంది. అయితే షూటింగులు అంటే కొత్త సినిమాల్ని ప్రారంభించేసుకుని చేసుకోవ‌చ్చా? అంటే కానే కాదు.

తొలిగా పెండింగులో ఉన్న షూటింగులు పూర్తి చేయాల‌ని ఆర్డ‌ర్స్ వ‌చ్చాయిట‌. ఆ త‌ర్వాత కొత్త‌వాటికి అనుమ‌తులు ఉంటాయి. ఇక తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల కేవలం మధ్యలో ఆగిపోయిన సినిమాలు సీరియల్స్ మాత్రమే షూటింగ్ చేసుకోవాలని దాని సారాంశం. షూటింగ్ లో 40 మంది కి ఎక్కువ ఉండరాదు. లొకేషన్ లో తప్పనిసరిగా డాక్టర్ ఉండాలి. ఆర్టిస్టుల బాధ్యత నిర్మాతలదే. ఆర్టిస్టుల ఎంపిక వీడియో కాన్ఫరెన్స్ లోనే జరగాలి. ప్రతి ఒక్కరు మాస్క్ లు శానిటైజర్ లు తప్పనిసరిగా వాడాలి. ఎక్క‌డ ఏ తేడా వ‌చ్చినా తోలు తీస్తామ‌ని పోలీసులు వార్నింగ్ ఇచ్చార‌ట‌.

అయితే కొవిడ్ 19 అనేది నోటి తుంప‌ర‌ల‌తో అంటుకుంటోంద‌ని.. గాల్లో 15 నిమిషాల పాటు తుంప‌ర‌ల నుంచి విడుద‌లైన వైర‌స్ స‌జీవంగా ఉండి ఇత‌రుల‌కు సోకుతోంద‌ని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో షూటింగుల్లో అల్ల‌క‌ల్లోలంపైనా చాలా సందేహాలేర్ప‌డుతున్నాయి. మునుముందు ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.