టీ (సినిమా) కప్ లో ఈగ పడింది!
ఏపీ, తెలంగాణ విభజన తర్వాత తెలుగు సినీపరిశ్రమ ఎటు వెళ్లాలి? అన్న తర్జనభర్జన సాగింది. విభజన అనంతరం టాలీవుడ్ వైజాగ్ కి తరలి వెళ్లిపోతుందని ప్రచారమైంది. కానీ అవేవీ జరగలేదు. ఆంధ్రులపై తెలంగాణ ఉద్యమకారుల సెగను తగ్గించి ఇక్కడ ఉన్న సినిమావాళ్లు ఎటూ వెళ్లాల్సిన పనేలేదు అని కేసీఆర్-కేటీఆర్ ద్వయం ప్రకటించడంతో పరిశ్రమ ఎటూ కదల్లేదు.
అయినా ఇంకా బోలెడన్ని సందిగ్ధతలు ఇన్నాళ్లు ఉండేవి. ఇప్పటికీ ఆ సందిగ్ధతలు ఉన్నాయి. పరిశ్రమ ఎటూ వెళ్లదు. కానీ తెలంగాణ పరిశ్రమకు ధీటుగా ఆంధ్రాలో టాలీవుడ్ అభివృద్ధి చెందే వీలుందన్న అంచనా అయితే ఇంకా సజీవంగానే ఉంది. రాజకీయ నాయకుల అనాసక్తి వల్ల అది ఇంకా ఎటూ కాని సన్నివేశంలో ఉంది. ఇకపోతే తెలంగాణలో తెలంగాణ సినిమా అభివృద్ధి చెందాలన్న కేసీఆర్ ఆకాంక్ష మాత్రం ఇంకా నెరవేరలేదు. తెలంగాణ కల్చర్ ని ఇక్కడ కథల్ని ఇక్కడ ట్యాలెంటును ప్రోత్సహిస్తూ ఒక నవ్యపంథా సినిమాని అభివృద్ధి చేయాలన్న ప్లాన్ చాలా కాలంగా ఉంది. అయితే అది అమల్లో అయితే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి కాబట్టి తెలంగాణ నేటివిటీ సినిమా అభివృద్ధికి లోకల్ ట్యాలెంటు పురోభివృద్ధికి కృషి చేయాలని కేసీఆర్ తలపోస్తున్నారట. మొన్న కళాతపస్వి కె.విశ్వనాథ్ ని కలిసిన సందర్భంలో కేసీఆర్ సినిమాకి కొత్త పాలసీ అంటూ ప్రస్థావించడంతో మరోసారి దీనిపై పరిశ్రమలో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. తెరాస అధినాయకుడు కొత్త పాలసీని తేనున్నారు. అయితే హైదరాబాద్ లో పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ సెటప్ చేస్తున్నామని.. గచ్చిబౌళి పరిసరాల్లోనే యానిమేషన్ హబ్ రెడీ చేస్తున్నామని చాలానే ప్రకటించారు. అయితే అవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. దర్శకుడు ఎన్.శంకర్ కి ఐదెకరాల స్థలాన్ని ఫిలింఇనిస్టిట్యూట్ కి కేటాయించారు కానీ నిధుల కేటాయింపు మాటేమిటో తెలీదు. మాటల ప్రభుత్వంలా కాకుండా చేతల ప్రభుత్వంలా ఈ పని చేస్తే బావుండేది. లేదంటే టీ (సినిమా) కప్ లో ఈగ పడిందిలే అని సరిపెట్టుకోవాల్సిందే.