అప్పుడే  పెళ్లి గురించి ఆలోచిస్తా!

అప్పుడే  పెళ్లి గురించి ఆలోచిస్తా!

 
ఏం సక్కగున్నాదే… అని తొలి సినిమాతోనే  అందరి హృదయాలను దోచుకున్నకథానాయిక తాప్సిది.  ఆమె సొట్టబుగ్గలు… సంపంగి ముక్కు… తెలుగు కుర్రకారు మనసుల్ని ఝుమ్మనిపించాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన తాప్సి అందంలోనే కాదు.. అభినయంలోనూ మేటి అని నిరూపించింది. హిందీలోనూ జెండా పాతేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ చిత్రాలతో తీవ్రంగా  సందడి చేస్తోంది.  
 
‘ఝుమ్మంది నాదం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ  అటు  తర్వాత ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘వీర’, ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాలతో మెప్పించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  అక్కడ తాప్సి నటించిన సినిమాల్లో దాదాపు అన్నీ మంచి ప్రశంసలు అందుకున్నవే. ఆమె సినిమాలు ఎంచుకునే తీరులో ఏదో ఒక విషయం ఉంటుందని అభిమానుల అంచనా. అందుకు ‘నామ్‌ షబానా’, ‘ముల్క్’, ‘బద్లా’ తదితర హిందీ చిత్రాలే నిదర్శనం.
 
చాలా కాలం తర్వాత తమిళంలో నటించింది.  ‘కాంచన 2’ (గంగ) తర్వాత తమిళ సినిమాలు చేయలేదు.  స్క్రిప్ట్‌తో పాటు దర్శకులు కూడా ముఖ్యమే అని చెప్పే తాప్సి  వారినే  ఎక్కువగా  నమ్ముతానంటోంది.  వారే తనకు  హీరోలు అని కూడా చెబుతుంది.  ఏదైనా సినిమాను  ఒప్పుకొనే ముందు దర్శకుడు ఎవరు? అన్నది బాగా ఆలోచిస్తుంది. . అశ్విన్‌ తీసిన ‘మయూరి’ చూసి ‘గేమ్‌ ఓవర్’కు ఒప్పుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రను ఎందుకు ఒప్పుకొన్నారు? అని చాలా  మంది తాప్సిని అడిగారట. పాత్ర ముఖ్యం. కానీ ఆ పాత్ర వయస్సు కాదు! అని చెప్పి తప్పించుకుందట.  
 
ఈ మధ్యకాలంలో తాప్సి నటించినవన్నీ దాదాపుగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌లే.  ప్రేక్షకులు  తన నుంచి కొత్తదనాన్ని ఆశించాలనే కోరుకుంటానంటోంది. . ఏదో సినిమా విడుదలైంది కాబట్టి చూడాలి. చూడకపోయినా పర్వాలేదు అన్న ధోరణి ఉంటే లాభం ఉండదన్నది ఆమె అభిప్రాయం.  ఒత్తిడి లేకుండా కిక్‌ ఉండదంటోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు తాప్సి  సినిమాలను బాగా ఆదరించారు.  సినిమా చూడటానికి ప్రేక్షకులు తమ విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించి వస్తున్నప్పుడు తాను  జాగ్రత్తగా పనిచేయాలి. ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంటే నటిగా తాను గెలిచినట్టే అని చెబుతుంది.
 
తాప్సి ఏడాదికి నాలుగు సినిమాలు చేయాలనుకుంటున్నా అని చెబుతోంది.  తాప్సి ని ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారట?  దానికి ఆమె- కుటుంబం, పిల్లలు అనే ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా  అప్పటిదాకా నా కెరీరే నాకు ముఖ్యం అని చెప్పి అక్కడినుంచి తప్పించుకుంటుందట. మన సంతోషం మన చేతుల్లోనే ఉంటుందని నమ్మే వ్యక్తిత్వం తాప్సిది.