ఆ హీరో లైంగికంగా  వేధించాడని  చెప్పాననే  దెబ్బ కొట్టారు

                                       (సూర్యం)

కొన్ని విషయాలు వింటూంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది..నిజంగా ఇలా జరుగుతుందా అనే సందేహం వస్తుంది. కానీ మనం ఎంత మొత్తుకున్నా నిజాలు నిజాలే.  అయితే నిజాలు చెప్పినందుకు చాలాసార్లు జీవితాలు, కెరీర్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. తను అదే పరిస్దితి ఎదుర్కొన్నానంటోంది తనుశ్రీ దత్తా.  అప్పట్లో తనను ఓ నటుడు తన చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత తను ఇండస్ట్రీకు దూరమయ్యాని  అంటున్నారు బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా.

తనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. ‘హాలీవుడ్‌లో ‘‘#metoo’ ఉద్యమం రెండేళ్ల క్రితం మొదలైంది. కానీ నేను దాన్ని బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల క్రితమే ప్రారంభించా. నాకు ఎదురైన వేధింపుల్ని మీడియా ముందు అప్పుడే బయటపెట్టా. ‘హార్న్‌ ఓకే ప్లీజ్’ అనే హిందీ సినిమాలో ఓ పాటలో నేను సోలోగా నర్తించాల్సి ఉంది. ఆ సమయంలో ఓ నటుడు నా చెయ్యి పట్టుకుని లాగాడు. ఆ పాటలో నేనొక్కదాన్నే డ్యాన్స్‌ చేయాలి. అక్కడే ఉన్న చిత్ర యూనిట్ ఆపడానికి యత్నిస్తున్నా అతను వినలేదు. ‘నీకు డ్యాన్స్‌ చేయడం రావడంలేదు. నేను నేర్పిస్తాను’ అన్నాడు.

ఈ విషయం గురించి అప్పుడే మీడియా ద్వారా వెల్లడించా. నిజం చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన మొదటి నటిని నేనే. దాదాపు మూడు రోజుల పాటు నాకు జరిగిన సంఘటన గురించి టీవీలో ప్రసారం అయింది. కానీ ఇప్పుడు మాత్రం దీని గురించి ఎవ్వరూ మాట్లాడటంలేదు. నేను ఆ విషయాలు బయట పెట్టినందుకే నాకు సినిమాలు లేకుండాపోయాయి’ అని వెల్లడించారు తనుశ్రీ. అయితే అప్పట్లో ఆమె
కంప్లైంట్ చేసిన హీరో మరెవరోకాదు నానా పటేకర్.