మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా:నరసింహారెడ్డి` నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ .. హిందీలో భారీగా రిలీజైంది. దాదాపు 4600 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా హాలీడే రిలీజ్ కాబట్టి.. ఈ సినిమా ఓపెనింగులపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇదంతా ఒకెత్తు అనుకుంటే సైరా వల్ల ఆరుగురు ఎస్పైలు కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి పై అభిమానం ఆ ఆరుగురి ఉద్యోగాలకు ఎసరు పెట్టిందని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మొదటి రోజే థియేటర్లలో చూడాలనుకున్నా ఆ ఆరుగురు ఎస్సైలు బెన్‌ఫిట్ షోకు వెళ్లడంతో వారిపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారట. వీరు విధి నిర్వహణలో ఉండగా ఇలా చేయడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. విధులను పక్కన పెట్టి ఆ ఆరుగురు మెగాభిమానులైన ఎస్సైలు సినిమాకి వెళ్లడంతో వారిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారని తెలిసింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెనిఫిట్ షోకు ఆ ఆరుగురు ఎస్సైలు వెళ్లారు. విధి నిర్వహణ సమయంలో ఇలా చేయడంతో వారిపై జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్ అయ్యారు. ఇలా నిర్లక్ష్యం వహించడంతో వీఆర్‌కు పంపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.