అంతా ఊహించినట్టే `సైరా: నరసింహారెడ్డి` ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ పతాక స్థాయిలో చూపించడంలో కొణిదెల టీమ్ సక్సెసైంది. తెల్లవాడి దౌర్జన్యానికి ఎదురెళ్లి పోరాడిన మహాయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి పెర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారని ట్రైలర్ ప్రూవ్ చేసింది. ఇంతకుముందు టీజర్ తోనే ఇంప్రెషన్ కొట్టేసిన మెగాస్టార్ వీరుడి గెటప్ లో అదరగొట్టారు. శత్రువు ఊహకు అందే లోపే కుత్తుకలు తెగ నరుకుతూ కత్తి ఝలిపిస్తూ చిరు వీరత్వం ప్రదర్శించిన స్టైల్ మైమరిపించింది.
నరసింహారెడ్డి సామాన్యుడు కాడు. అతడు కారణజన్ముడు.. అంటూ అమితాబ్ వాయిస్ తో ట్రైలర్ ఆరంభమైంది. అతడొక యోగి.. అతనొక యోధుడు.. అతడినెవరూ ఆపలేరు! అంటూ చిరు ఎంట్రీని ఓ రేంజులో ఇచ్చారు. నరసింహారెడ్డిని నేరుగా ఎదుర్కోలేని ఆంగ్లేయులు సామాన్య ప్రజల్ని ఎలా టార్చర్ చేసి దుర్మార్గంగా చంపారో విజువల్స్ చూస్తుంటే ఎమోషన్ కలుగుతుంది. ట్రైలర్ చూశాక.. సుదీప్ వీరత్వం.. సాయానికి వచ్చిన తమిళ యోధుడు విజయ్ సేతుపతి పాత్రలకు తగినంత ప్రాధాన్యత ఉందని అర్థమవుతోంది. తన ఏలుబడిలో ప్రజల్ని హింసించి చంపే ఆంగ్లేయులపై పగ ప్రతీకారంతో రగిలిపోయే వీరాధివీరుడిగా చిరు అద్భుతమైన ఆహార్యం చూపించారు. తమన్నా, నయనతార ఇద్దరూ నరసింహుని భార్యలుగా కనిపించారు. వార్ జోన్ లో నీహారిక కొణిదెల ఎంట్రీ సింపుల్ గా టచ్ చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం విజువల్ గ్రాండియారిటీ మైమరిపించింది.
దాదాపు 270 కోట్ల బడ్జెట్ ఎందుకు వెచ్చించామని చెబుతున్నారో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజులు, రాజ్యాలు, కోటలు, సాంప్రదాయం ఇలా అన్ని కోణాల్ని చూపించారు. బాహుబలి తర్వాత మళ్లీ అంతటి ప్రామిస్సింగ్ సినిమా టాలీవుడ్ నుంచి వస్తోంది అన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ ఇచ్చింది. రీరికార్డింగ్ .. కెమెరా వర్క్.. కాస్ట్యూమ్స్ ఇలా అన్ని కోణాల్లో విజువల్ గ్రాండియారిటీ మైమరిపించింది. ట్రైలర్ తో హిట్ కొట్టారు. అక్టోబర్ 2న వస్తున్న సినిమా ఏ స్థాయిలో ట్రీట్ ఇవ్వనుంది? అన్నది చూడాలి. అన్నట్టు సైరా నరసింహుడు ఉరి కంబం ఎక్కే ఎమోషనల్ ఘట్టం క్లైమాక్స్ లో ఎమోషన్ ని పీక్స్ కి తీసుకెళుతుందని అంటున్నారు. శాడ్ ఎండింగ్ కి సంబంధించి ట్రైలర్ లో హింటిచ్చారు. మరి థియేటర్లలో చిరు అభిమానులు ఎలా స్వీకరిస్తారు? అన్నది చూడాలి.