ఈ లోకం గెలిచిన వాళ్లు చెబితేనే వింటుంది!
ఆడ పిల్ల ఆరుబయట అడుగుపెడితేనే సవాలక్ష కండీషన్లు పెడతారు పేరెంట్. అలాంటిది ఓ పల్లెటూరి రైతు బిడ్డ ఇండియన్ టీమ్ తరపున క్రికెట్ ఆడాలనుకుంటే అదేమైనా ఆషామాషీ లక్ష్యమా? ఇండియన్ టీమ్ ఓడితే నాన్న కంట కన్నీళ్లు చూడలేక… బాల్యంలోనే క్రికెటర్ కావాలనుకుంటుంది కౌశల్య. ఈ పయనంలో కౌశల్య కృష్ణమూర్తి అనుకున్నది సాధించిందా లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.
క్రికెట్ నేపథ్యంలో సినిమా అనగానే జెర్సీ గుర్తుకు వస్తుంది. నాగచైతన్య `మజిలీ` చిత్రంలో క్రికెట్ ఆడారు. ఇప్పుడు వీటన్నిటికీ మించి డిఫరెంట్ మూవీ క్రికెట్ నేపథ్యంలో వస్తోంది. తాజాగా `కౌశల్య కృష్ణమూర్తి` ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంది. ఐశ్వర్య ధనుష్ క్రికెటర్ గా పెర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. మిథాలీ రేంజులో ఆడిందే! అన్నట్టుగా ట్రైలర్ ఆద్యంతం పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్ ని తలపించింది. గవాస్కర్ .. సచిన్ క్రికెట్లోకి కొడుకుల్ని పంపించారు కానీ కూతుళ్లను పంపించలేదు కదా! ఆళ్ల కన్నా ఎక్కువా ఈయన? అంటూ కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్)ని ప్రశ్నించడం చూస్తుంటే .. విలేజ్ లెవల్లో ఆడపిల్లలకు క్రీడల పరంగా వెనకబాటును సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి క్రికెట్లో రాణించాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పాల్సిన పనేలేదు. ఎంచుకున్న నేపథ్యం ఎంతో స్ఫూర్తి వంతమైనది. స్పోర్ట్స్ ని అమితంగా ఇష్టపడే కె.ఎస్.రామారావు ఎంతో ప్యాషన్ తో నిర్మించారు.
ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు. గెలిచిన వాళ్లు చెబితేనే వింటుంది! అంటూ కోచ్ శివకార్తికేయన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ లో స్ఫూర్తి నింపుతోంది. కౌశల్య కృష్ణమూర్తి ట్రైలర్ హిట్టు. అయితే ఆఫ్ బీట్ కంటెంట్ తో కాకుండా ఈ సినిమాని ఎంత ఎమోషనల్ గా చూపించారు? అన్నది ఇంపార్టెంట్. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆగస్టు 23న ఈ చిత్రం రిలీజవుతోంది.