ఇదేమైనా రికార్డుల కోసం ప్రయత్నమా?
సైరా ట్రైలర్ రిలీజై దాదాపు 50లక్షల వ్యూస్ ని అందుకుంది. నిన్న హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ట్రైలర్ వేడుక ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. ట్రైలర్ కి మీడియా వర్గాల నుంచి ప్రశంసలు కురిశాయి. అద్భుతం అంటూ పొగిడేశారంతా. అటుపై ఇంటరాక్షన్ లో చరణ్- సురేందర్ రెడ్డి బృందంపై మీడియా రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తే వాటికి అంతే ఎమోషనల్ గా దర్శకనిర్మాతలిద్దరూ సమాధానాలిచ్చారు. దాదాపు 10 ఏళ్ల క్రితమే తీయాల్సిన సినిమా.. ఇప్పుడు తీయాలనుకోవడానికి కారణమేంటి? ఇదేమైనా రికార్డుల కోసం ప్రయత్నమా? పాన్ ఇండియన్ రికార్డుల కోసమే అన్ని భాషల నటుల్ని తీసుకున్నారా? అంటూ సూటిగా ప్రశ్నల పరంపర కొనసాగింది.
దీనికి చరణ్, సురేందర్ రెడ్డి ధీటైన జవాబులే ఇచ్చారు. పదేళ్ల నాడు కథ రెడీ అయినా .. ఇప్పటి టెక్నాలజీ స్టాండార్డ్స్ తో ఈ సినిమా తీయడమే కరెక్టనిపించిందని దర్శకుడు సురేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. చరణ్ నా వద్దకు వచ్చి డాడీకి గిఫ్ట్ ఇవ్వాలి.. సినిమా హిస్టరీలో నంబర్ వన్ గా నిలవాలని అడిగారు. ఆ సంకల్పం గొప్పది. అందుకే మొదలైంది. ఈ సినిమా ఎంతవరకూ అయినా వెళుతుంది! అంటూ సురేందర్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. “రికార్డుల గురించి ఆలోచించలేదు…చిరంజీవి గారి సినిమా అనగానే ప్యాషనేట్ గా చేశాం. ఈ అవకాశం రావడమే అదృష్టం“ అని రామ్ చరణ్ అన్నారు.
పాన్ ఇండియా .. మాకు తెలీదా?
ప్యాషన్ ఉంటే సరిపోతుందా.. పాన్ ఇండియా సినిమా చాలా కష్టం కదా? అన్న ఓ ప్రశ్నకు చెర్రీ సూటిగానే స్పందిస్తూ చురకలు వేశారు. “ఆలోచించకుండా చేస్తామా? అంత తెలీకుండా తీస్తామా?“ అని స్పందించారు. సైరా కోసం బెస్ట్ టెక్నీషియన్స్ .. అమేజింగ్ నటీనటులు పని చేశారు. ఎవరితో కలిసినా వారి ఆలోచన ఎంత స్వచ్ఛంగా ఉందన్నది చూస్తాను. అలాంటి స్వచ్ఛమైన వారితోనే పని చేస్తాను అని తెలిపారు. పాన్ ఇండియా కోసమే తమిళం కన్నడం హిందీ స్టార్లను ఎంచుకున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ. .. కథ డిమాండ్ మేరకు ఎంచుకున్నామని దర్శకుడు తెలిపారు. చిరంజీవి గారితో కలిసి కొంత సమయం అయినా స్క్రీన్ పై కనిపించాలని అంతా భావించి నటించారు. నరసింహారెడ్డిగా నటించిన చిరంజీవికి ఉన్న బలం ఇది. అదే నడిపించిందని చరణ్ అన్నారు.