యంగ్ హీరో సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ బాలీవుడ్ ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. తొలుత అభిమానుల ఆవేశం చల్లార్చేందుకు ఆత్మహత్య అని పోలీసులు ప్రకటించినా .. దానివెనక అసలు నిజాలేంటో కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ రెండ్రోజుల్లోనే రకరకాల సన్నివేశాలు ఇది ఆత్మహత్య కాదనేందుకు ఆధారంగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్ని వేళ్లు సుశాంత్ సింగ్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వైపే చూపిస్తుండగా కొన్ని రియా వెనక ఉన్న అదృశ్య శక్తులను చూపెడుతున్నాయి. సుశాంత్ అంటే గిట్టనివాళ్లే రియాను ఎరవేసి ఈ పని చేశారా? అంటూ కంగన తీవ్రంగా విరుచుకుపడుతోంది. రియాతో డేటింగ్ చేసిన వెటరన్ నిర్మాత మహేష్ భట్ ని విచారించాలని కంగన పోలీసుల్ని డిమాండ్ చేసింది.
ఇదంతా ఇలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు సిద్ధార్థ్.. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వమని అతడి కుటుంబం తనపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించడం సంచలనమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ .. రియా చక్రవర్తి ఇద్దరికి కామన్ స్నేహితుడు ఈ ప్రకటన చేయడం వేడెక్కిస్తోంది.
జూన్ 14 న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. కానీ రకరకాల సందేహాల నడుమ సుశాంత్ తండ్రి.. రియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కామన్ మిత్రుడు ముంబై పోలీసులకు తన ఇమెయిల్‌లో ‘రియాను ఇరికించమని ఒత్తిడి చేస్తున్నారు’ అని రాశాడు. ఎఫ్‌ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయమని రియా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న సంగతి విధితమే.
జూలై 28 న ముంబై పోలీసులకు పంపిన ఇమెయిల్‌లో, దివంగత నటుడి కుటుంబం నుండి కనీసం మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రియా చక్రవర్తి రాజ్‌పుత్‌తో ఉన్నప్పుడు ఆమె చేసిన ఖర్చుల గురించి ఒక ప్రకటన ఇవ్వమని వారు కోరారు. సోదరి మీతు సింగ్ – బంధువు ఓపి సింగ్ సహా సుశాంత్ కుటుంబ సభ్యులు తనను జూలై 22 న కాన్ఫరెన్స్ కాల్‌లో పిలిచారని, అక్కడ మరో తెలియని నంబర్ కూడా చేరిందని, మళ్ళీ జూలై 27 న, ఇదే విధమైన కాల్ లో తనను కోరారని ఆయన ఆరోపించారు. రియాకు వ్యతిరేకంగా చెప్పమని కోరారు. అంతే కాదు.. నాకు అసలు తెలియని విషయాల్ని చెప్పమన్నారు అని ఆరోపించాడు.
ముంబైకి ఎఫ్ఐఆర్ బదిలీ చేయమని తాజాగా సుప్రీంలో రియా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో బీహార్‌లో నిష్పాక్షిక దర్యాప్తు ఉండదనేది తన ఆరోపణ. అందువల్ల ఎఫ్‌ఐఆర్ బదిలీ సహా దర్యాప్తును ముంబైకి బదిలీ చేయాలని ఆమె కోరింది. సుశాంత్ సింగ్ డిప్రెషన్ తోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కూడా రియా ఈ పిటీషన్ లో వెల్లడించింది.
తనపై అత్యాచారం సహా మర్డర్ బెదిరింపులకు వ్యతిరేకంగా ముంబై శాంటా క్రజ్ పోలీస్ స్టేషన్లో తాజాగా రియా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తును రియా గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.