వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.. ఇదొక అంతులేని కథ.!

YS Viveka's Death Mystery, An Endless Story?

YS Viveka's Death Mystery, An Endless Story?

ఆయనేమీ ఆషామాషీ వ్యక్తి కాదు. మంత్రిగా పనిచేశారు.. పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు.. తెలుగునాట రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి సోదరుడు.. అయితేనేం, ఆయన్నెవరు చంపారు.? అన్నది మాత్రం ఏళ్ళు గడుస్తున్నా తెలియరావడంలేదు. పోలీసులు ఛేదించలేని కేసు అనుకోవాలా.? ఇంకేమైనా అనుకోవాలా.? రాష్ట్ర స్థాయిలో సిట్.. ఏమీ తేల్చలేకపోయింది. చంద్రబాబు హయాంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ ఇదే పరిస్థితి. కేసు సీబీఐ చేతికి అందింది.

సీబీఐ విచారణ ప్రారంభమయి కూడా చాలా కాలమే అయ్యింది.. కానీ, డెత్ మిస్టరీ వీడలేదు. పరిచయం అక్కర్లేని ఆ వ్యక్తి ఇంకెవరో కాదు వైఎస్ వివేకానందరెడ్డి. తాజాగా ఈ కేసులో సీబీఐ విచారణ మళ్ళీ మొదలైంది. వివేకా కారు డైవర్ సహా పలువుర్ని విచారించారట సీబీఐ అధికారులు. ఆ విచారణలో ఏం తేలిందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ కేసు విషయమై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హైకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే సీబీఐ విచారణ జరుగుతోంది. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి ప్రభుత్వంపై నమ్మకం లేక వైఎస్ జగన్, వివేకా హత్య కేసుని సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేయడం వాస్తవం.

తాను అధికారంలోకి వచ్చాక, సీబీఐ విచారణ అవసరం లేదని కోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విన్నవించడమూ వాస్తవం. ఎందుకిలా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. సీబీఐకి ఇస్తే మాత్రం.. విచారణ ఓ కొలిక్కి వచ్చిందా.? రాలేదే.! కానీ, ఈ కేసు చుట్టూ చాలా రాజకీయం నడుస్తూనే వుంది. గొడ్డలి పోటు కాస్తా గుండెపోటుగా ఎలా ప్రచారంలోకి వచ్చింది.? అన్న ప్రశ్నకే సమాధానం ఇంకా దొరకలేదు. ఏమో, ఇంకో రెండు మూడేళ్ళ తర్వాత అయినా వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడుతుందో లేదో.! జనానికైతే నమ్మకాలు పోయాయ్.