వైఎస్ వివేకా హత్య: సీబీఐ విచారణలో కీలకమైన ముందడుగు.?

YS Viveka Death Mystery
YS Viveka Death Mystery
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సీబీఐ కీలకమైన ముందడుగు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. విచారణలో వాచ్‌మెన్ రంగయ్య సంచలన విషయాలు వెల్లడించాడట. ఇద్దరు ప్రముఖులు, 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వాచ్‌మెన్ రంగయ్య వెల్లడించాడంటూ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. మొత్తం 9 మంది వ్యక్తులకు ఈ కుట్రలో భాగం వుందట.
 
ఐదుగురు కొత్త వ్యక్తులు వివేకా హత్య జరగడానికి ముందు వివేకా ఇంటికి వచ్చినట్లు వాచ్‌మెన్ రంగయ్య చెప్పాడన్నది మీడియా కథనాల సారాంశం. అయితే, దీంట్లో ఎంత నిజముందన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. మెజిస్ట్రేట్ ముందు రంగయ్య చెప్పిన విషయాల్ని రికార్డ్ చేయించారట సీబీఐ అధికారులు.
 
చిత్రమేంటంటే, ఈ కేసు ఓ కొలిక్కి రావడంలో కీలకంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారి మారడం. దర్యాప్తు అధికారి మార్పు వార్త, ఆ వెంటనే వాచ్‌మెన్ రంగయ్య వెల్లడించిన వివరాలకు సంబంధించిన వార్త ఒకేసారి వెలుగు చూడటం గమనార్హం. అయితే, సీబీఐ ఈ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు కొందరు కరోనా బారిన పడ్డారు.
 
దాంతో, విచారణలో కొంత జాప్యం జరిగింది. అయితే, గడచిన కొద్ది రోజులుగా విచారణ వేగవంతమయ్యింది. విచారణాధికారులు ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో చాలామందిని విచారించారు. ఈ క్రమంలోనే రంగయ్య నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణ హత్యకు గురైన విషయం విదితమే.